యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో సమరసింహా రెడ్డి ఎంత బ్లాక్బస్టర్ హిట్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పుడు చిరంజీవి స్నేహంకోసం సినిమాతో పోటీ పడింది. అయితే స్నేహంకోసం యావరేజ్ అయితే సమరసింహారెడ్డి అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాసింది. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అప్పట్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇదే పెద్ద రికార్డు.
మళ్లీ ఈ సినిమా రికార్డులను నాలుగేళ్ల తర్వాత 2001లో మళ్లీ బాలయ్యే తన సంక్రాంతి సినిమా నరసింహా నాయుడు సినిమాతో తిరగరాసుకున్నారు. సమరసింహారెడ్డిలో బాలయ్య ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. సిమ్రాన్ – సంఘవి – అంజలా ఝవేరి నటించారు. మణిశర్మ స్వరాలకు తోడు పరుచూరి బ్రదర్స్ రచన, బి. గోపాల్ టేకింగ్, విజయేంద్ర ప్రసాద్ కథ, జయప్రకాష్ రెడ్డి విలనిజం అన్నీ కూడా బాలయ్య పవర్ ఫుల్ నటనకు తోడయ్యి ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి.
అయితే ఈ సినిమా కథ ముందుగా విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లిందట. ఈ కథ విన్న వెంకటేష్ ఈ కథ తనకు సూట్ కాదని.. ఎవరైనా మాస్ హీరో చేస్తే బాగుంటుందని చెప్పారట. ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ ఈ కథను బి. గోపాల్ తో కలిసి చెన్నై వెళ్లి మరీ బాలయ్యకు వినిపించారట. బాలయ్య వెంటనే ఓకే చెప్పడం ఈ సినిమా షూటింగ్ చేయడం జరిగిపోయాయి. చివరకు ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగ రాయడంతో పాటు బాలయ్య కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా మిగిలిపోయింది.