Moviesప్రేమకు వయస్సు అడ్డుకాదు అని నిరూపించిన జంట వీళ్లే..!

ప్రేమకు వయస్సు అడ్డుకాదు అని నిరూపించిన జంట వీళ్లే..!

బాలీవుడ్‌లో మెథడ్‌ ఆర్టిస్ట్‌గా, సహజ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు దిలీప్‌కుమార్‌. తనదైన శైలి నటన, డైలాగ్‌ డిక్షన్‌తో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారాయన. నాలుగున్నర దశాబ్ధాలుగా 70 చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందిన దిలీప్‌కుమార్‌ గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

భారతీయ సినీ చరిత్రలో ఓ మహోజ్వల శకం ముగిసిపోయింది. ఐదు దశాబ్దాల పాటు అనన్యసామాన్య నటనవైదూష్యంతో సినీ సామ్రాజ్యాన్ని ఏలిన అభినయ చక్రవర్తి ఇక సెలవంటూ శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. భారతీయ వెండితెరపై తొలి సూపర్‌స్టార్‌ దిలీప్‌కుమార్‌. ఎక్కడా నాటకీయత కనిపించని సహజ అభినయం, చక్కటి సంభాషణ చాతుర్యం, తెరపై నిండైన మూర్తిమత్వం మేలికలయికగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. నవరసాల్ని నవనవోన్మేషితంగా పలికించి నటనానిఘంటువుగా కొనియాడబడ్డారు.

పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న దిలీప్‌కుమార్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 1940లో కెరీర్‌ను ప్రారంభించిన దిలీప్‌కుమార్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలను నిర్మించారు. ‘అందాజ్’ సినిమాతో నటుడిగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న దిలీప్‌కుమార్ ఆ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా సాధించారు. అందాజ్, ఆన్, దేవ్‌దాస్, మొఘల్ ఎ ఆజం, గంగా జమున వంటి విభిన్న చిత్రాలు ఆయన కెరీర్‌లో మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి. 1994లో సినీ రంగంలో అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు దిలీప్‌కుమార్.

ప్రేమకథా చిత్రాలకు పరిమితం కాకూడదనే ఆలోచనతో 1952లో రూపొందిన ‘ఆన్‌’తో తన పంథా మార్చుకున్నారు దిలీప్‌కుమార్‌. జానపద కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి ప్రేమికుడిగా హాస్యం, హీరోయిజం కలబోతగా కూడిన పాత్రలో నటించారు. 17 భాషల్లో 28 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం చరిత్రను సృష్టించింది.

సినిమాల్లో భగ్న ప్రేమికుడి పాత్రకు తిరుగులేని మనిషి దిలీప్‌కుమార్‌. జీవితంలోనూ ఆయనకు ఆ అనుభూతి తప్పలేదు. వయసులో ఉన్నప్పుడు నటి మధుబాలను ప్రేమించారాయన. కానీ మత వ్యవహారాలు వీరి ప్రేమకు అడ్డుపడ్డాయి. తనతో కలిసి నటించిన హీరోయిన్లు కామినీ కౌశల్‌తో క్లోజ్‌గా ఉండేవారు. కానీ వివాహం చేసుకోలేదు.

‘గంగాజమున’, ‘నయా దౌర్‌’, ‘లీడర్‌’ వంటి సినిమాల్లో నాయికగా నటించిన వైజయంతీమాలతో సన్నిహితంగా ఉండేవారు. అక్కడా దెబ్బకొట్టింది. మరో త్రిలోక సుందరి నసీమ్‌ కూతురు సైరాభానును చూశారు దిలీప్‌. ఇద్దరి మతాలు ఒకటే! కానీ ఇద్దరి వయసులో వ్యత్యాసం ఉంది.

ప్రేమకు వయస్సు అడ్డం కాదని నిరూపించారు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ ఆయన సతీమణి సైరాభాను. వయసు పరంగా 22 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పటితరంలో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

12 ఏళ్ల వయసులోనే సైరాభాను దిలీప్‌కుమార్‌తో ప్రేమలో పడ్డారు. ఆయన వయసు 44. వయసులో తారతమ్యాన్ని పక్కనపెట్టి సైరా ఆయన్ని ఎంతగానో అభిమానించింది.

44 ఏళ్ల దిలీప్‌ 22 ఏళ్ల సైరాభాను దగ్గరికి నేరుగా వెళ్లి ‘నిన్న పెళ్లి చేసుకుందాం’ అనుకుంటున్నాను అని చెప్పేశారు. లవ్‌ ఎట్‌ మెనీ సైట్‌. బట్‌ మ్యారేజ్‌ ఎట్‌ ఫస్ట్‌ టాక్‌ అన్నట్లు వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు సంతానం లేదు.

కాలం గడిచే కొద్ది.. దిలీప్‌కుమార్‌కు బాలీవుడ్‌లో ఖ్యాతి మరింత పెరిగింది. అదే సమయంలో సైరాభాను సైతం నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్‌ ఆరంభంలోనే గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వీళ్లిద్దరిని పెట్టి సినిమాలు తీయాలని ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్‌ భావించారు. కానీ, వయసులో తనకంటే చిన్నదైన సైరాతో స్క్రీన్‌ పంచుకోవడానికి దిలీప్‌ మొదట్లో అంగీకరించలేదు.

 

వివిధ సినిమాలు, పాత్రల ద్వారా ఎన్నో తారల నటుల్లో స్ఫూర్తిని నింపిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల్ని మిగిల్చివెళ్లిపోయారు. ఆయన మరణం బాధాకరం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news