టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం టీకాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. సీనియర్ నేతలు అధిష్టానం తీరుపై చిర్రు బుర్రులాడుతున్నారు. ఒక్కసారిగా పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే 2023 వరకు తాను గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనని చెప్పేశారు. ఇక ఇప్పుడు రేవంత్‌కు పదవి ఇవ్వడంతో అలకబూనిన వారంతా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కొందరు కీలక నేతలు టీఆర్ఎస్ అధిష్టానంతో టచ్‌లోకి వెళుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ లిస్టులో ఇద్దరు కీలక నేతలు ఉండడం కూడా రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. అసమ్మతి గళానికి కెప్టెన్‌గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని విడుతారన్న ప్రచారం జోరందుకుంది. వీరిద్దరు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు కూడా తమకు పీసీపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇక భట్టి కంటే కోమటిరెడ్డి అయితే తనకే టీ పీసీసీ పదవి ఖాయం అనుకున్నారు.
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి త్రూ టీఆర్ ఎస్ నేతల ద్వారా కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఇక భట్టి తీరు కొద్ది రోజులుగా మారుతోంది. ఇటీవలే దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ అంశంపై నిరసనలకు దిగిన భట్టికి ప్రగతిభవన్ నుంచి పిలుపు రావడంతో ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిశారు. దీనిపై సైతం కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అలకబూనిన భట్టి కాంగ్రెస్‌లో ఉన్నా ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. ఏదేమైనా రేవంత్‌కు పదవి ఇవ్వడం టీ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలకు కారణమవుతోంది.