దివ్యభారతి.. తన అందంతో… తన నటనతో 90 వ దశకంలో కుర్రకారుని ఉర్రూతలూగించింది. దివ్యభారతి ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. దివ్య భారతి అతి పిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. దివ్యభారతిని ప్రముఖ నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసారు. ఈ సినిమాకు బి గోపాల్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
బొబ్బిలి రాజా సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ భామ, చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ, బాలకృష్ణ తో వచ్చిన ధర్మక్షేత్రం మొదలగు చిత్రాలలో నటించి, మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు తమిళ భాషాల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించిన ఈ అందాల భామ.. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే.. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. సినిమాల్లో ఓ రేంజ్లో ఉండగానే దివ్యభారతి మే 10 న 1992 లో సాజిద్ నడియాడ్వాలాను పెళ్లి చేసుకుంది. ఇక ఓ సంవత్సరం తర్వాత ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
అయితే, అప్పటికే ఆమె నటిస్తున్న తొలి ముద్దు సినిమా షూటింగ్ సగం పూర్తి అవ్వడంతో.. మిగతా సగం పూర్తి చేయడం కోసం ఆమె డూప్ గా రంభ నటించారు. రంభ నటించిందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అంతలా రంభ.. దివ్యభారతి లాగా నటించి మెప్పించింది.