కరోనా వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇంగ్లండ్‌లో చాలా మంది పిల్లలు స్కూల్స్ ఎగ్గొట్టేందుకు ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) చేయించుకునే ముందు ఆరెంజ్, కచెప్, ఇతర పండ్ల రసాలు తాగుతున్నారట. దీని వల్ల ఫలితంలో కరోనా పాజిటివ్ వస్తుందని.. ఇలాంటి తప్పుడు పనులు తాము సహించబోమంటూ మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా పిల్లలు కేవలం స్కూల్ మానేసేందుకే ఈ పనులు చేస్తున్నారంటూ పిల్లల తల్లిదండ్రులకు ఓ మెయిల్ కూడా పెట్టింది.
సోమవారం నుంచి ఈ స్కూల్లో పిల్లలకు చేస్తోన్న కరోనా టెస్టుల్లో వరుస పెట్టి అందరికి పాజిటివ్‌లే వస్తున్నాయట. దీంతో అనుమానం వచ్చిన స్కూల్ యాజమాన్యం ఆరా తీయగా.. కరోనా పరీక్షకు ముందు పిల్లలు ఇలా పండ్ల రసాలు తాగుతున్నారని.. దీని వల్ల కరోనా ఫలితం పాజిటివ్‌గా వస్తుందని తేలిందట. బ్రిటన్‌లో పలు పాఠశాలలకు చెందిన పిల్లలు ఇదే పని చేస్తున్నారు. ఈ విషయం వైరల్ కావడంతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు. దీంతో ఇకపై పిల్లలకు టెస్టులు చేసేముందు వారు పండ్ల రసాలు తీసుకోకుండా జాగ్రత్త తీసుకుని మరీ పరీక్షలు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సూచిస్తున్నారు.