ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైం వలలో పడి అనేక మంది విలవిల్లాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మగ వ్యభిచారుల పేరుతో జరిగిన మోసం గుట్టు బయట పడింది. మగ వ్యభిచారులు కావాలంటే డేటింగ్ వెబ్‌సైట్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఎవరైనా స్పందిస్తే అమ్మాయిలతో నైస్‌గా మాట్లాడించి లక్షలు కొట్టేస్తున్నారు. మేల్ ఎస్కార్ ఉద్యోగాల ప్రకటన చూసిన వెంటనే ఓ వ్యక్తి వారితో కాంటాక్ట్ అయ్యాడు. కొందరు అమ్మాయిలు సదరు వ్యక్తితో మాట్లాడి మెంబర్ షిఫ్, బీమా అంటూ రు 13. 82 లక్షలు లాగేశారు.
ఆ తర్వాత వీఐపీ కాంట్రాక్టులు అని మరో 1.5 లక్షలు అడిగారు. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదే చేయడంతో సీపీ సజ్జనార్ రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. చివరకు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరు నేపాల్ సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పట్టణం కేంద్రంగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అక్కడ మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్ నూర్ ఆలం అన్సారీని అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వీరు కొన్ని వెబ్‌సైట్లను క్రియేట్ చేసుకుని.. షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఆఫీసులు ఓపెన్ చేసి మోసాలు చేస్తున్నారు. వీరు మొత్తం పది మంది మహిళా టెలీకాలర్స్‌ను నియమించుకున్నారు. వీరు పలువురిని ఆకర్షించి కోట్లలోనే డబ్బులు గుంజినట్టు పోలీసుల విచారణలో తేలింది.