పెరిగిన వైద్య విధానాలతో భారతీయుల ఆయుష్షు పెరగిందన్న నివేదికలు వస్తున్నాయి. భారతీయుల సగటు ఆయుష్షు పదేళ్లకుపైగా పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సగటు భారతీయుడు ఆయుష్షు 70.8 ఏళ్లకు చేరుకుంది. దీనికి సంబంధించి లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను కూడా ప్రచురించింది. 1990లో సగటు భారతీయుడి ఆయుష్షు 59.6 ఏళ్లుగా ఉంది. ఇది 2019 నాటికి 70.8 ఏళ్లకు చేరుకుంది. సగటు ఆయుష్షు ఏకంగా పదేళ్లు పెరిగినా కూడా భారత్‌లో ఇది పలు రాష్ట్రాల మధ్య అనేక అసమానతలో ఉందట.
అనేక అంశాలను భేరీజు వేసుకుని లాన్సెట్ ఈ నివేదికను రూపొందించింది. కేరళలో మనిషి జీవిత కాలం గతంతో ఉన్నదానితో పోలిస్తే మరింత పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో సగటు జీవిత కాలం ఏకంగా 77.3 ఏళ్లకు చేరుకుంది. ఇది యూపీలో 66.9గా ఉంది. ఆయుష్షు కాలం పదేళ్లు పెరిగినా.. ఇండియా ప్రజలు మాత్రం అనుకున్నంత ఆరోగ్యంగా జీవించడం లేదని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొన్నది.
ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది భారతీయులు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రపంచంలో చాలా దేశాల్లో అంటు వ్యాధులు తగ్గడం మాత్రం అభినందనీయం. ఒకప్పుడు భారత్‌లో ఎక్కువుగా ఉండే శిశు మరణాల సంఖ్య ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అయితే గుండె సంబంధిత, క్యాన్సర్ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోండడం ఆందోళన కలిగించే అంశం.