తెలంగాణలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే ఉన్నాయి. అయితే పట్నాలు, పల్లెల్లో ఇంకా రోగుల సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటకీ పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడి కోలుకుంటున్నారు. ఈ లిస్టులోకి మరో ఎమ్మెల్యే చేరిపోయారు. జగిత్యాల జిల్లా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోవిడ్ భారీన పడ్డారు. సంజయ్ కుమార్ ఇటీవలే ఓ వేడుకకు హాజరు అయ్యారు.
ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన టెస్ట్ చేయించుకోగా ఆయనకు కోవిడ్ వచ్చిందని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. రెండు రోజులుగా పలువురు ప్రముఖులు సంజయ్‌ను కలిసినట్టు సమాచారం. దీంతో ఆయన కూడా వారందరిని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సంజయ్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వచ్చింది.
దీంతో నిన్నటి వరకు ఆయనను కలిసిన వారంతా లబోదిబో మంటున్నారు. తాజాగా తెలంగాణలో కొత్తగా 1708 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఏపీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన చెన్నై అపోలోలో వైద్యం పొందుతున్నారు.