ప్రేమించడం లేదని ఓ యువతిని సజీవదహనం చేయడంతో బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి ( 24) విజయవాడలో ఓ హాస్పటల్లో నర్సుగా పనిచేస్తోంది. తనతో పనిచేసే యువతులతో కలిసి ఆమె సమీపంలోనే ఓ గది అద్దెకు కూడా తీసుకుంది. అయితే కొద్ది రోజులుగా రెడ్డిగూడెం మండలంశ్రీరాంపురానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.
ఈ విషయమై బాధితురాలు నాలుగు రోజుల క్రిందటే గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఆ యువతి తన విధులు ముగించుకుని తన రూమ్‌కు బయలు దేరింది. అయితే ప్లాన్ ప్రకారం నాగభూషణం ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించిన క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నాగభూషణం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పింటించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ క్రమంలోనే నిందితుడికి సైతం మంటలు అంటుకోవడంతో అతడు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.