ఓ ఫ్రెంచ్ జంట ఎంతో ముచ్చటపడి పిల్లిని తెచ్చుకున్నారు. వారం రోజుల పాటు ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. ఆ తర్వాత వారికి గుండెలు పగిలిపోయే నిజం తెలిసింది. తాము ఎంతో ముచ్చటపడి పెంచుకుంటోంది పిల్లి కాదు పులి అన్న విషయం తెలిసింది. దీంతో వారు షాక్ అయిపోయారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీకి చెందిన లా, హవ్రే అనే దంపతులు సవన్నా జాతి పిల్లి కోసం ఆన్లైన్ ప్రకటన చూసి దాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ పిల్లిని ( పులి ) 6000 యూరోలకు కొనుక్కుని ఎంతో ఇష్టంగా ఇంటికి తెచ్చుకున్నారు. అయితే వారం గడిచే లోపలే తమతో ఉన్నది.. తాము పెంచుకుంటోంది పిల్లి కాదని.. మూడు నెలల పులి పిల్ల అన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులిని కొనడంతో పాటు దానిని రవాణా చేసినందుకు ఆ జంటపై కేసు పెట్టారు.
ఈ క్రమంలోనే పోలీసులు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు సుదీర్ఘమైన విచారణ కొనసాగింది. అయితే కోర్టు మాత్రం ఆ జంటను నిర్దోషులుగా ప్రకటిస్తూ కొట్టివేసింది. ప్రస్తుతం పులిని ఫ్రెంచ్ బయో డైవర్సిటీ కార్యాలయ అధికారులకు అప్పగించగా, పులి ఆరోగ్యం బాగానే ఉందని వారు చెప్పారు.