వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లి బోస్ సతీమణి సత్యనారాయణమ్మ ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెను హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమె మృతి చెందారు.
పిల్లి బోస్ సమైక్య రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తన మంత్రి పదవి వదులుకుని వైసీపీలో చేరారు. గతేడాది ఎన్నికల్లో బోస్ మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. మంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన తన ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని స్వ గ్రామానికి తరలిస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయని తెలిసింది. సత్యనారాయణమ్మ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సత్యనారాయణమ్మ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.