హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇటీవల చిరుతల భయం ఎక్కువుగా ఉంది. నగర శివార్లలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో గత నాలుగైదు నెలలుగా చిరు అటవీ సిబ్బందికి దొరకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ చిరుత దొరికిపోయింది. ఐదు నెలలుగా ఎంతో మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ చిరుత రంగారెడ్డి జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో రోడ్లమీదే పడుకుంటూ పాదచారులు, లారీ డ్రైవర్లపై దాడులు చేస్తోంది.
కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడినప్పటి నుంచి దానికోసం వేట కొనసాగుతూనే వస్తోంది. అడవిలోకి వెళ్లడం.. బయటకు రావడం.. దాడులు చేసి మళ్లీ అడవిలోకి వెళ్లిపోతుండడంతో చిరుత దొరకడం లేదు. అయితే ఎట్టకేలకు ఈ చిరుతను అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ వ్యవసాయ క్షేత్రంలో పశువుల కొట్టంపై చిరుత దాడి చేసింది.
అక్కడే నెల రోజుల తర్వాత మరోసారి దాడి చేసి ఓ లేగదూడను చంపేసింది. మరోసారి అదే వ్యవసాయ క్షేత్రంలోకి గత రాత్రి చిరుత రాగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో పడింది. దీంతో చిరుతను జూ పార్క్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు.