ఏపీలో హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక హిందూ దేవాలయంలో ఏదో ఒక సంఘటన జరగడం.. ఇక అధికార పార్టీ మంత్రులు, నేతలు ఈ సంఘటనల్లో ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడడం..మరోవైపు హిందూ స్వాములు, ప్రతిపక్ష పార్టీల కౌంటర్లతో ఏపీ రాజకీయం ఓ రేంజ్‌లో హీటెక్కుతోంది.
దీనిపై ఎన్న విమర్శలు వస్తున్నా.. కౌంటర్లు కొనసాగుతున్నా హిందూ దేవుళ్లు, గుడులపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూల్చేశారు. పత్తికొండ శివారు గుత్తికి వెళ్లే దారిలో రహదారి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఈ ఉదయం స్థానికులు అక్కడ ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నాకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా ఈ విషయం మరోసారి ఏపీలో చర్చనీయాంశంగా మారింది.