ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఇంట్లో తరచూ డ్రగ్ పార్టీలు ఏర్పాటు అవుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 2019 జూలైలో కరణ్ జోహార్ ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీ మరోసారి తెరమీదకు వచ్చింది. అప్పట్లో కరణ్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీ వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియో చూసిన కొందరు ఇది డ్రగ్ పార్టీ అని విమర్శించారు. అప్పట్లో ఇది బాగా వైరల్ అవ్వడంతో తాము డ్రగ్స్ తీసుకోలేదని ఆ పార్టీలో ఉన్నవారు వివరణ ఇచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నాయకుడు మన్జిందర్ సింగ్ బాలీవుడ్ సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఈ సెలబ్రిటీల్లో కరణ్ జోహార్ – దీపికా పదుకొణె – మలైకా అరోరా – అర్జున్ కపూర్ – షాహిద్ కపూర్ – విక్కీ కౌశల్ – వరుణ్ ధావన్ తదితరులు ఉన్నారు. పార్టీకి వెళ్లిన వీరంతా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. అలాగే కరణ్ నాడు షేర్ చేసిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వీడియో నకిలీదా, వాస్తవమా ? అని తెలుసుకున్న వెంటనే దీనిపై కూడా విచారణ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ విచారణతో ఆ పార్టీలో ఉన్న ప్రముఖుల్లో కూడా ఆందోళన ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.