ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని కోవిడ్ దెబ్బతో విలవిల్లాడుతుంటే మరికొందరు కోవిడ్ పేరు చెప్పి నాటకాలకు తెరదీస్తున్నారు. ఓ ప్రబుద్ధుడు తనకు కరోనా సోకిందని చెప్పి భార్యను నమ్మించి ప్రియురాలితో సరసాలాడుతూ ఎట్టకేలకు దొరికిపోయాడు. ముంబైకు చెందిన 28 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి జూలై 24న తన భార్యకు ఫోన్ చేసి తనకు కరోనా సోకిందని.. తాను బతకనని చెప్పి ఫోన్ చేసి ఆ వెంటనే స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో ఆ యువకుడి బైక్, హెల్మెట్, బ్యాగు, ఇతర వస్తువులు వశీ సెక్టార్ 17లో లభ్యమయ్యాయి. అయితే పోలీసులు సమీపంలోని కోవిడ్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు, హాస్పటల్స్ అన్ని వెతికించారు. అయినా అతడి ఆచూకీ దొరకలేదు. అయితే అతడు భార్యకు ఫోన్ చేసిన రోజే 100కు రెండుసార్లు కాల్ చేశాడు. దీంతో ఆ నెంబర్ ఆధారంగా పోలీసులు లొకేషన్ గుర్తించారు.
ఆ యువకుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తన ప్రియురాలితో అతను ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని… ముంబై తీసుకువచ్చారు. ఇక తన భర్త కరోనా అని చెప్పి ప్రియురాలితో ఉన్నాడని తెలిసి భార్య షాక్కు గురైంది.