గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదంతోనే వార్తల్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆమె తనకు రు. 80 లక్షలు ఇవ్వాలంటూ సొంత పార్టీకే చెందిన వైసీపీ నేత, జీడీసీఎంఎస్ డైరెక్టర్ మేకల రవి కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి భర్త ఎన్నికల సమయంలో తన దగ్గర తీసుకున్న సొమ్ములో ఇంకా రు. 80 లక్షలు ఇవ్వాలని.. డబ్బులు అడిగితే ఎస్పీతో అరెస్టు చేయిస్తానని బెదిరించడంతో పాటు నీకు జీడీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని అంటున్నారని వాపోయాడు.
శ్రీదేవి తీరుతో తాడికొండలో వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని కూడా రవి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వివాదం సర్దుమణగక ముందే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీదేవి తుళ్ళూరు లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ వైపు కరోనా సమయంలో కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు రాకూడదు అన్న నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించి మరీ శ్రీదేవి కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు.
ఓ వైపు రాజధాని కోసం పోరాడుతోన్న వారిపై కరోనా నిబంధనలు అంటూ పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని.. కానీ ఎమ్మెల్యే శ్రీదేవి సభలకు వేలాది మంది జనం వచ్చినా ఈ రూల్స్ ఆమెకు వర్తించవా ? అంటూ సామాన్య జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.