బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. తొలిరోజే సీబీఐ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆమెకు చుక్కలు కనిపించాయంటున్నారు. ఇక జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోన్న రియా సుశాంత్‌కు మద్యం తాగే అలవాటు, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని కూడా చెపుతోంది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అక్కడితో ఆగని రియా సుశాంత్ కు మాజీ ప్రియురాలు అంకితా లోఖండేకు ఇటీవల మాటలు కలిశాయని.. వారిద్దరూ మాట్లాడుకున్నారని ఆరోపించారు. రియా చేసిన వ్యాఖ్యలపై అంకితా లోఖండే ఘాటుగా స్పందించారు. తాను సుశాంత్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడితో మాట్లాడలేదని చెప్పారు. ఇక తనకు సుశాంత్ ప్లాట్ కొనిచ్చాడన్న ఆరోపణల్లో కూడా నిజం లేదని.. తాము విడిపోయాక మణికర్ణిక సినిమా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో మాత్రమే ఓ సారి మెసేజ్‌లు చేసుకున్నామని.. ఆ తర్వాత ఎప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుకోలేదని అంకితా చెప్పారు.
ఇక తనతో ఉన్నప్పుడు సుశాంత్ మానసికంగా చాలా బలంగా ఉండేవాడని.. కేవలం రియాతో ప్రేమాయణం వల్లే ఇలా జరిగిందని అంకితా ఆరోపించింది. తాను సుశాంత్ తల్లిదండ్రులకే మద్దతు పలుకుతున్నానని రియాను ఏకేసింది.