ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి కీలకమని ఇప్పటి వరకు అందరూ చెపుతున్నారు. అయితే రోగ నిరోధక శక్తి విషయంలో పురుషుల కంటే మహిళలే స్ట్రాంగ్ అని అంటున్నారు. అందుకే పురుషుల కంటే మహిళలు కరోనాను సులువుగా జయిస్తున్నారని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
యేల్ యూనివర్సిటీకి(యూఎస్ఎ) చెందిన నేచర్ జర్నల్ తన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనాను ఎదుర్కొనే టీ సెల్స్ పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువుగా ఉంటాయని అందుకే వారు కరోనాను సులువుగా ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక చెప్పింది. ఇక మానవుల్లో టీ సెల్స్ సమృద్ధిగా ఉంటే క్రిమికారక, ఇతర వైరస్‌లను సులువుగా ఎదుర్కోవచ్చని చెపుతున్నారు.
పురుషుల్లో టీ సెల్స్ నామమాత్రంగా పనిచేస్తుంటే.. స్త్రీలలో మాత్రం ఇవి చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తున్నట్టు నివేదిక తెలిపింది. 98 మంది కరోనా బాధితులను పరీక్షించి నివేదికను రూపోందించారు. మరోవైపు రోగనిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ మహిళల్లో అత్యద్భుతంగా పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.