Newsటిక్‌టాక్ కొనుగోలు రేసులో మ‌రో దిగ్గ‌జం

టిక్‌టాక్ కొనుగోలు రేసులో మ‌రో దిగ్గ‌జం

చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు టిక్‌టాక్‌ను కొనేందుకు ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ రేసులో ఉండ‌గా ఇప్పుడు మ‌రో దిగ్గ‌జం వాల్‌మార్ట్ సైతం ఈ రేసులో నిలిచింది. మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి తాము టిక్‌టాక్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోనున్న‌ట్టు వాల్‌మార్ట్ తాజాగా ప్రకటించింది. ఇక ప‌ద‌విలో చేరిన మూడు నెల‌ల‌కే టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయ‌ర్ రాజీనామా చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

ఇక టిక్‌టాక్‌ విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు గ‌డువు విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ గ‌డువులోనే ఒప్పందం పూర్తి చేయాల‌ని టిక్ టాక్ మాతృసంస్థ బైట్స్‌డాన్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై వ్యాఖ్యానించ‌డానికి బైట్స్ డాన్ నిరాక‌రించింది. ఇక అమెరికాలోని టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఇక అమెరియా యూజ‌ర్ల స‌మాచారం చైనా ప్ర‌భుత్వానికి చేర‌వేస్తోందంటూ ట్రంప్ టిక్‌టాక్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారం అమెరికాలో ఏదైనా సంస్థ‌కు విక్ర‌యించ‌క‌పోతే అమెరికాలో టిక్‌టాక్‌ను తాము నిషేధిస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. ఇక భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news