ప్రపంచ మహమ్మారి కోవిడ్-19కు ఇప్పట్లో చికిత్స లేదని… దీనికి చికిత్స లేకపోవచ్చని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. స్వయంగా ముందునుంచి ఈ విషయంలో చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్యసంస్థే ఈ నిజం వెల్లడించడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓ వైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌వో నుంచే ఈ ప్రకటన రావడంతో అందరూ ఒక్కసారిగా డీలాపడ్డారు.
ఇక ఇప్పుడు కరోనా కట్టడికి ముందున్న మార్గం కేవలం టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌లు పెట్టుకోవడమే అని కూడా చెప్పింది. ఈ మాత్రం జాగ్రత్తలు ప్రజలు ఇప్పటి వరకు పాటించడం లేదా… దీనికే డబ్ల్యూహెచ్‌వో గొప్పగా చెప్పాలా ? అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మహమ్మారిని త్వరగా అరికట్టే అద్భుతమైన చికిత్స ఏదీ కూడా ఇప్పట్లో రాకపోవచ్చని కూడా డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ స్వయంగా ఈ విషయం చెప్పారు. అసలు చైనాలో ఈ వైరస్ మనుష్యుల్లోకి ఎలా ప్రవేశించింది అన్న అంశంపై విచారణ జరిపేందుకు ఇద్దరు సభ్యులను సైతం డబ్ల్యూహెచ్‌వో అక్కడకు పంపింది. ఏదేమైనా డబ్ల్యూహెచ్‌వో స్వయంగా ఇప్పట్లోనే కాదు కరోనాకు చికిత్స లేదన్నట్టుగా చేసిన ప్రకటన అందరిని భయ బ్రాంతులకు గురి చేసేలా ఉంది. మరి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ వస్తేనే తప్పా ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడేలా లేరు.