రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 1.58 లక్షలకు చేరుకోగా.. మరణాలు 1474గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువ చేస్తున్నారన్న చర్చ నడుస్తున్నా ఇక్కడ కూడా కరోనా కేసులు 66 వేలుగా ఉన్నాయి. తెలంగాణలో కరోనా మరణాలు 540గా ఉన్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో ఏపీతో పోలిస్తే కరోనా పరీక్షలు తక్కువుగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక్కడ కూడా కరోనా పరీక్షలు ఏపీలోలా జరిగితే ఈ పాటికి ఇక్కడ కూడా లక్షకు పైగానే కేసులు నమోదు అవుతాయని అంటున్నారు.
ఇక తెలంగాణలో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా భారీన పడ్డారు. అలాగే ఆయన డ్రైవర్‌తో పాటు ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు కరోనా ఉన్నా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే వీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సోకుతోందని అర్థమవుతోంది.