తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం యాక్షన్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విశాల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తారు పాకిస్తానీ ఉగ్రవాదులు. ఈ క్రమంలో తమన్నాను వారు కిడ్నాప్ చేస్తారు. వారి బారి నుండి తమన్నాను విశాల్ కాపాడతాడు. కట్ చేస్తే.. సీఎం కొడుకైన విశాల్ తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పాక్ టెర్రరిస్టు లీడర్‌ను భారత్‌కు పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో భాగంగా అతడికి తమన్నా సాయం చేస్తుంది. ఇంతకీ విశాల్‌కు జరిగిన అన్యాయం ఏమిటీ..? విశాల్ ఎవరికోసం పాకిస్తాన్ వెళతాడు..? అక్కడ అతడు అనుకున్నది సాధిస్తాడా..? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
కాప్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అనేక సినిమాలను పోలి ఉంటుంది విశాల్ యాక్షన్ సినిమా. కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరో పాత్ర ఇంట్రొడక్షన్ మొదలుకొని, అతడు చేసే చేజింగ్‌లు, ఫైట్లతో పూర్తిగా యాక్షన్ సినిమాను చూపించారు దర్శకుడు సి.సుందర్. ఇక టెర్రరిస్టులను పట్టుకునేందుకు విశాల్ వేసే ఎత్తుగడలు, వాటిని అమలు చేసే విధానంతో సినిమా చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది.
సెకండాఫ్‌లోనూ యాక్షన్ డోస్ ఏమాత్రం తగ్గించకుండా జాగ్రత్త పడ్డారు చిత్ర యూనిట్. పాకిస్తాన్‌లో టెర్రరిస్టును పట్టుకునే క్రమంలో విశాల్ చేసే యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇకపోతే అతడికి తమన్నా సాయం చేసే విధానం కూడా బాగుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌కు కావాల్సిన యాక్షన్‌ను జోడించి సినిమాకు మంచి ముగింపు ఇచ్చాడు దర్శకుడు సుందర్.
ఓవరాల్‌గా చూస్తే, యాక్షన్ ప్రియులకు బిర్యానీ వడ్డించే విధంగా ఈ సినిమా ఉంటుంది. విశాల్ యాక్షన్, కళ్లు చెదిరే భారీ సీక్వెన్స్‌లతో విశాల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మొత్తానికి యాక్షన్ ప్రియులకు యాక్షన్ సినిమా నిజమైన ట్రీట్ అని చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
విశాల్ ఈ సినిమాలో చాలా మాస్ లుక్‌లో కనిపించాడు. ఎప్పటిలాగే తన యాక్షన్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక యాక్షన్, చేజింగ్ సీన్స్‌లో విశాల్ యాక్టింగ్ సూపర్. తమన్నా కూడా సినిమాలో చాలా బాగా నటించింది. యాక్షన్ సీన్స్‌లోనూ అమ్మడు చెలరేగిపోయింది. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు సుందర్ సి రాసుకున్న యాక్షన్ కంటెంట్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను తాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సుందర్ సి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల బీజీఎం తారాస్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
చివరగా:
యాక్షన్ – యాక్షన్ ప్రేమికులకు ఫుల్ మీల్స్.. కాదు బిర్యానీ!
రేటింగ్:
3.0/5.0