మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కొద్ది గంటల్లో థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమా రిలీజ్‌ను తాము అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సైరాను ముందు బయోపిక్ అని చెప్పి ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టించేలా సినిమా తీశారంటూ తమిళనాడు తెలుగు యువత సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
సైరా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సినిమాను కేవలం వినోదం పరంగానే చూడాలని కోర్టు హితవు పలికింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను సైతం ఎవ్వరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించలేరని… సినిమాటిక్‌గా ఉండడం కోసం ప్రతి చరిత్రలోనూ కొంత కల్పిత గాథ కూడా ఉంటుందని కోర్టు చెప్పింది.
గతంలో గాంధీజీ, మొగల్ సామ్రాజ్యం విషయంలో కూడా కల్పితం ఉందంటూ హైకోర్టు వివరించింది. సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. ఇక కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.