అజ్ఞాతవాసి సినిమా దెబ్బకు ఆకాశం నుంచి పాతాళంలోకి దిగాడు త్రివిక్రమ్. బాహుబలి సినిమా సూపర్ హిట్ అయితే టాలీవుడ్‌లో చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు రాజమౌళిని ప్రశంసిస్తే.. త్రివిక్రమ్ నుంచి చిన్న ట్వీట్ కూడా లేదు. త్రివిక్రమ్‌కు తానే గొప్ప అన్న ఇగో బాగా ఉంటుందన్నది టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపించే మాట. అజ్ఞాతవాసి త్రివిక్రమ్ ఆహాన్ని చాలా వరకు దించింది. తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురంలో హిట్.
బన్నీ అల వైకుంఠపురంలో నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేసింది. పైగా కోట్లాది రూపాయల బడ్జెట్ కాదు.. ఏళ్ల తరబడీ షూటింగ్‌లు లేవు.. అయినా నైజాం లాంటి చోట్ల నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేయడం అంటే రాజమౌళి కంటే త్రివిక్రమ్ గొప్పంటూ కొందరు ఊదరగొట్టడంతో త్రివిక్రమ్ మళ్లీ ఆకాశంలోకి వెళ్లిపోయాడు. అసలు నాలుగేళ్లుగా సినిమాలు చేయలేదు. పవన్ సినిమాలు సెట్ చేస్తూ.. ఆ సినిమాలకు పని చేస్తూ రెమ్యునరేషన్లు తీసుకుంటూ కాలం గడిపేస్తూ వచ్చాడు.
కట్ చేస్తే ఇప్పడు మహేష్‌బాబుతో తెరకెక్కించిన గుంటూరు కారం సినిమా ఘోర పరాజయం. ఆ సినిమాకు ఆ మాత్రం వసూళ్లు వచ్చాయంటే అది కేవలం మహేష్‌బాబు ఛరిష్మా వల్లే. ఇప్పుడు గుంటూరు కారం ప్లాప్ దెబ్బతో అసలు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వరూ త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఏ మాత్రం ఆసక్తితో లేరు. బన్నీకి త్రివిక్రమ్ మూడు హిట్లు ఇచ్చాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ సినిమా ఉంటుందని అనుకున్నారు.
అయితే ఇప్పుడు బన్నీ తండ్రి అల్లు అరవింద్ షాక్ ఇస్తూ బోయపాటితో తన బ్యానర్లో ఓ మాసీవ్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా బన్నీతోనే ఉంటుందంటున్నారు. ఏదేమైనా సక్సెస్ ఉంటేనే ఎవరైనా ఛాన్సులు ఇస్తారు. ఈ విషయంలో త్రివిక్రమ్ కూడా అతీతుడు కాదు. నిన్నమొన్నటి వరకు త్రివిక్రమ్ అంటే ఆహా ఓహో.. ఆయనతో సినిమా చేస్తాం అన్న వాళ్లే ఈ రోజు ఆయన్ను పక్కన పెట్టేందుకు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.
ఏదేమైనా త్రివిక్రమ్ ఇప్పటకి అయినా మబ్బులు వీడి అసలు వాస్తవాలు తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే ఆయన కెరీర్ మరి కొంత కాలం విజయవంతంగా కొనసాగుతుంది.