నైజాంలో పంపిణీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీస్ అక్కడ ఏక చక్రాధిపత్యంతో దూసుకుపోతు అగ్ర నిర్మాత దిల్ రాజుకు వరుసపెట్టి షాకుల మీద షాక్‌లు ఇస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను నిర్మించడంతోపాటు.. ఆ రెండు సినిమాలను పంపిణీ చేసి రెండు సూపర్ హిట్లతో సక్సెస్ కొట్టింది. సంక్రాంతికి ఒకేసారి మైత్రి మూవీస్ నిర్మించి పంపిణీ చేస్తున్న సినిమాలు నైజాంలో రిలీజ్ అవుతుండటం.. అటు దిల్ రాజు వారసుడు సినిమా కూడా రేసులో ఉండడంతో థియేటర్ల కోసం ఎంత రచ్చ జరిగిందో చూశాం.
చివరకు ఈ పోటీలో రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో నైజాంలో చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది మైత్రి మూవీస్. ఇక ఈ ఏడాది విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను కూడా నిర్మించి నైజాంలో పంపిణీ చేసింది. తాజాగా వచ్చిన ప్రభాస్ సలార్ సినిమా రైట్స్ కోసం దిల్ రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా మైత్రి చేతికి నైజాం రైట్స్ చిక్కాయి. ఇక ఇప్పుడు సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నైజాంలో గట్టి పోటీ ఉంది.
మహేష్ బాబు గుంటూరు కారం తో పాటు.. వెంకటేష్ సైంధవ్ సినిమాలో కొంత భాగం కూడా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల దిల్ రాజు మీటింగ్ పెట్టి హనుమాన్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ టైంలో అదే హనుమాన్ సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీస్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.7.2 కోట్లకు ఈ సినిమా నైజాం హక్కులు సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
సంక్రాంతికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో.. అందులోను అటు దిల్ రాజు పంపిణీ చేస్తున్న రెండు పెద్ద సినిమాలు ఉన్నా కూడా.. మైత్రి వాళ్లు హనుమాన్ లాంటి చిన్న హీరో నటించిన సినిమాకు రూ.7 కోట్లు పెట్టి హక్కుల సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా దిల్ రాజుతో పోటీ విషయంలో మైత్రి ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఈ విషయంలో ఢీ అంటే ఢీ అనేలా ముందుకు వెళుతుంది.