తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్-అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత.. అంతే అనుబంధంతో సినిమాలు చేసిన హీరోలు.. కృష్ణ, శోభన్‌బాబులు. ఈ ఇద్దరు కలిసి అనేక సినిమాల్లో నటించారు. అయితే, ఇండస్ట్రీలోకి కృష్ణ కంటే కూడా.. శోభన్‌బాబు ముందుగా వచ్చారు. ఇలా.. ఇద్దరి మధ్య కొన్నేళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ.. డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయాల్లో మాత్రం హీరో కృష్ణదే పైచేయిగా ఉండేది. ఇదే.. శోభన్‌బాబుతో ఆయనకు స్నేహం కుదిరేలా చేసింది. నీ అంత ధైర్యం నాకు లేదు కృష్ణా! అని చెప్పేవారట శోభన్‌బాబు.
ఇద్దరూ కూడా కొన్ని దశాబ్దాల పాటు కలిసే పనిచేశారు. ఎన్నో సినిమాలు చేశారు. అయితే.. వీరిద్దరిమధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండిపోయింది. కానీ.. దీనికి ముందు ఒక్క అడుగు ముందుకు పడి ఉంటే.. ఇద్దరూ బంధుత్వాలు కూడా కలుపుకొని ఉండేవారని అంటారు. ఇద్దరూ బావ బావమరుదులు అయ్యేవారట. కానీ, ఇక్కడే హీరో కృష్ణ తల్లి అడ్డుపడ్డారని అంటారు. కృష్ణ మొదట్లో ఎక్కువగా శోభన్ బాబు ఇంట్లో ఉండేవారట. ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకొని సేద తీరేవారట.
అప్పట్లో శోభన్ బాబు మరదలు ఒకామె శోభన్ బాబు ఇంట్లో ఉండేవారు. ఆయనే ఆమెకు ఆలనా పాలనా చూసేవారు. చదివించారు కూడా. ఈక్రమంలో ఆమెకు వివాహం చేయాలని భావించినప్పుడు.. శోభన్ బాబు కి తన మరదలని కృష్ణకి ఇచ్చి పెళ్ళిచెయ్యాలని అనుకున్నారట. అయితే.. ఈ విషయాన్ని కృష్ణకు చెప్పకుండా.. ముందుగా ఆమె తల్లిని సంప్రదించారట. కానీ కృష్ణ తల్లి మాత్రం.. తనకు వచ్చే కోడలు కృష్ణ మాదిరిగా తెల్లగా వుండాలని, మరేమీ అనుకోకు అని శోభన్ బాబుకి చెప్పేసిందట.
దీంతో శోభన్‌బాబు పెళ్లి ప్రయత్నాలను విరమించుకున్నారు. అలా నిజజీవితంలో బావాబావమరుదులు గా బంధుత్వం కలవాల్సిన కృష్ణ, శోభన్ బాబులకి ఆ సంబంధం అవలేదు. చానాళ్లకు ఈ విషయం కృష్ణకు తెలిసి.. బాధపడ్డారట. అయ్యో.. నన్ను అడగకపోయావా? అని కూడా అనేవారట. ఇలా బంధుత్వం కలవకపోయినా జీవితాంతం వారు కలిసి ఉన్నారు. శోభన్‌బాబు హఠాత్తుగా మృతి చెందినప్పుడు.. హుటాహుటిన కృష్ణ వెళ్లడమే కాదు.. అన్నీ దగ్గరుండి జరిపించారు. ప్రతి ఆరు మాసాలకు విధిగా శోభన్‌బాబు ఇంటికి వెళ్లి.. ఆయన కుమారుడు కరుణాకర్‌ను పరామర్శించేవారట కూడా!