అది అన్నగారు ఎన్టీఆర్, మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు విజృంభిస్తున్న సమయం. ఎటు చూసినా వీరి అభిమానులే. వీరి కటౌట్లే. ఇక, మరో హీరో అంటూ.. లేరా? అనే చర్చ సాగుతున్న సమయం అది. అప్పటికి నటశేఖర కృష్ణ కానీ, శోభన్‌బాబుకానీ.. ఇంకా పుంజుకోలేదు. అలాంటి సమయంలో తెలుగు చిత్రాల్లో చిన్న బడ్జెట్ సినిమాలకు హీరోగా రాణించారు చంద్రమోహన్. నిజానికి చంద్రమోహన్ పొట్టిగా ఉంటారనే పేరుంది. అయినప్పటికీ.. ఓవర్గం ప్రేక్షకులు ఆయన హారతులు పట్టారు.
ఉదాహరణకు శంకరాభరణం, సిరిసిరిమువ్వ, శుభోదయం వంటి సినిమాల్లో చంద్రమోహన్ విశ్వరూపం ప్రదర్శించారు. ఇక, అన్నగారు ఎన్టీఆర్‌తో చంద్రమోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 100 రోజుల దినోత్సవం చేసుకున్న శంకరాభరణంసినిమాకు అన్నగారిని ఆహ్వానించాల్సిందేనని పట్టుబట్టి మరీ అన్నగారిని తీసుకువచ్చారు. అంతేకాదు.. కుటుంబాల పరంగా కూడా .. చంద్రమోహన్ ఇద్దరు పిల్లల పేర్లను కూడా ఎన్టీఆర్ సూచనల మేరకే పెట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది.
చంద్రమోహన్ ఇంట్లో ఏకార్యక్రమం జరిగినా..తొలి ఆహ్వాన పత్రిక అన్నగారికి ఇవ్వాల్సిందే. ఆయన ఆశీస్సులే సినీమా రంగంలో తనను నిలదొక్కుకునేలా చేశాయంటూ..అనేక సందర్భాల్లో చంద్రమోహన్ చెప్పారు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడం.. సామాజిక వర్గాలు వేరైనా..అన్నగారి ఆర్థిక క్రమశిక్షణను చంద్రమోహన్ పాటించడం వంటివి అన్నగారిని సైతం ముగ్ధులను చేశాయి. దీంతో సుదీర్ఘకాలం వీరి మధ్య అనుబంధం కొనసాగింది.
చంద్రమోహన్‌కు అన్నగారు కూడా అనేక సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇప్పించారు. తమ్ముడు.. తమ్ముడు.. అని పిలుస్తూ.. మా తమ్ముడికి ఇవ్వండి! అంటూ.. కొన్ని పాత్రలను ఆయనే సజ్జస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చెన్నై నుంచి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చేసిన తర్వాత.. అంత ధరలు పెట్టి తాను స్థలం కొనుగోలు చేయలేనని చెప్పినప్పుడు.. సీఎంగా ఉన్న అన్నగారు.. అతి తక్కువ ధరలకే చంద్రమోహన్‌కు ఇంటి స్థలం ఏర్పాటు చేశారంటే.. వీరి మధ్య అనుబంధం ఎలాంటి దో అర్థమవుతుంది.