టాలీవుడ్లో స్టార్ హీరోలను నమ్మకంతో నమ్మించి నిండా ముంచేసే స్టార్ డైరెక్టర్లు ఉంటారు. అంతకుముందు ఎవరైనా డైరెక్టర్ ఒక హిట్టు కొట్టాడు అంటే చాలు స్టార్ హీరో దగ్గరికి వెళ్లి లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పేసి ఈ కథతో మనం బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం బాబు అని హీరోలకు సోప్ వేస్తూ ఉంటారు. హీరోలు కూడా అంతకుముందు ఆ డైరెక్టర్ కి ఉన్న హిట్ సినిమాలు చూసి వారి మాయలో పడి వాళ్లకు చాన్సులు ఇచ్చేసి సినిమాలు చేస్తుంటారు.
అయితే ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు డిజాస్టర్లు అయి అందరిని నిండా ముంచేస్తాయి. అంతేకాకుండా ఆ హీరో పరువు కూడా గంగలో కలిపేస్తూ ఉంటాయి. కొందరు టాలీవుడ్ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లుగా పైకి చెప్పుకుంటూ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేసి నిర్మాతలతో పాటు ఆ హీరోలను, ఆ సినిమాకు ఉన్న వాళ్ళు అందరిని నిండా ముంచేశారు. మరి అలాంటి స్టార్ డైరెక్టర్లు ఎవరో చూద్దాం.
సురేందర్ రెడ్డి :
ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక హిట్ సినిమా మాత్రమే తీస్తూ ఉంటాడు. అతనొక్కడే సినిమాతో కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డిని దర్శకుడుగా పరిచయం చేశారు. అతనొక్కడే సినిమాతో కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చాడని ఎన్టీఆర్ రెండుసార్లు గుడ్డిగానే ఊసరవెల్లి, అశోక్ సినిమాతో ఛాన్సులు ఇస్తే రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నిజంగా ఈ రెండు సినిమాలు కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌కి పెద్ద దెబ్బ కొట్టాయి. ఆ తర్వాత మహేష్ బాబును నమ్మించాడు. అతిధి సినిమా ఛాన్స్ ఇస్తే ఆ డిజాస్టర్ దెబ్బతో మహేష్ ఏకంగా మూడున్నర సంవత్సరాలు సినిమా చేయలేదు.
ఆ తర్వాత తనకు ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ బ్యానర్ లో తనను గుడ్డిగా నమ్మి కిక్ 2 సినిమా చేయమని చెప్తే కళ్యాణ్‌రామ్ కు రూ.40 కోట్ల భారీ నష్టం మిగిల్చాడు. ఆ తర్వాత సైరాతో చిరంజీవిని ముంచేసి.. ఏజెంట్ సినిమాతో అఖిల పరువు అంతా గంగలో కలిపేశాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా పెద్ద డిజాస్టర్ కావాలంటే సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తే చాలు అన్న స్థితికి దిగజారి పోయాడు.
వివి. వినాయక్ :
వివి.వినాయక్ కెరీర్ ప్రారంభంలో రాజమౌళితో పోటీ పడుతూ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. బద్రీనాథ్ సినిమాతో వినాయక్ పతనం మొదలైంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌ను హీరోగా లాంఛ్ చేయమని నాగార్జున నమ్మి వినాయక్ చేతిలో పెడితే అఖిల్ లాంటి పరమ చెత్త సినిమా తీసి నాగార్జునకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. మధ్యలో ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయిన అది వినాయక్ గొప్పతనం కాదు రీమేక్ సినిమా. అందులో ఆ సినిమా చాలావరకు చిరంజీవి ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులే చూసుకున్నారు. ఇక్కడ వినాయక్ పూర్తిగా డమ్మీ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్, ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాలు వినాయక్‌ని పరమ చెత్త డైరెక్టర్ల జాబితాలో చేర్చేశాయి.
మెహర్ రమేష్…
ఇక అరి వీర భయంకరమైన డిజాస్టర్ డైరెక్టర్ ఎవరు ? అంటే ముందుగా వినిపించే పేరు మెహర్ రమేష్. మెహర్ రమేష్ పేరు చెప్తే శక్తి, కంత్రి, షాడో తాజాగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తమ కెరీర్లో ఏ హీరోకు అయినా ఓ పీడకలగా మిగిలిపోయే చెత్త సినిమా కావాలి అంటే మెహర్ రమేష్ తో సినిమా చేస్తే చాలు. ఏది ఏమైనా ఈ డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ నిర్మాతలను నిండా ముంచేస్తూ హీరోలను దారుణంగా దెబ్బ కొడుతున్నారు.