తెలుగు చలన చిత్ర రంగంలో ప్రయోగాలకు వేదిక పరిచిన వారు ఎవరైనా ఉన్నారంటే.. అది ఎన్టీఆరే. ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ముందు నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఎన్టీఆర్.. తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన విశ్వరూపం ప్రదర్శించారు. నటన పరంగా ఆయన వేయని వేషం లేదు. ఇక, కుటుంబాన్ని కూడా ఆయన సినీ రంగంలో ప్రోత్సహించారు. ఆడ పిల్లలను పక్కన పెడితే.. మగ వారిని ఆయన సినీరంగంలోకి తీసుకువచ్చారు.
ఇలా బాలయ్యను తెరమీదకు పరిచయం చేసింది ఎన్టీఆరే. బాల నటుడిగా బాలయ్య తాతమ్మ కల సినిమాలో నటించారు. అయితే.. ఆయనకు ఓ మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా బ్రహ్మంగారి చరిత్ర
ఇది ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తీసిన సినిమా. చరిత్ర ఆధారాలను సేకరించి.. ఏకంగా కడప జిల్లాలోనే మూడు మాసాలు తిష్టవేసి.. బ్రహ్మంగారు తిరిగిన ప్రాంతాలన్నీ కలియ దిరిగి.. ఈ కథను రాసుకున్నారు.
ఈ మొత్తం సినిమాలో సిద్దయ్య పాత్ర సెకండ్ హాఫ్‌లో కీలకం. సిద్దయ్య.. బ్రహ్మంగారి శిష్యుడు.గురువు చెప్పింది చేయడమే సిద్దయ్య పని. ఆయన వెన్నంటి ఉండి. ఆయనను రక్షించుకోవడమే కర్తవ్యం. ఇలాంటి పాత్రకు తొలుత శోభన్‌బాబును అనుకున్నారు. దీనికి బాబు కూడా అంగీకరించారు. అయితే.. కడపలోనే ఉండాల్సి రావడం.. చెన్నై వెళ్లేందుకు.. వేరే షూటింగ్‌లో పాల్గొనేందుకు అన్నగారు అంగీకరించకపోవడంతో శోభన్‌బాబు షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారు.
దీంతో తన కుమారుడు బాలయ్యనే సిద్దయ్య వేషానికి ఒప్పించారు ఎన్టీఆర్. వాస్తవానికి అప్పటికి హీరోగా రాణిస్తున్న బాలయ్య ఇలాంటి పాత్రలకు ఒప్పుకోరని అందరూ భావించారు. కానీ, తండ్రి అడగడం, ఆయనే స్వయంగా దర్శకత్వం చేయడం వంటి కారణాలతో బాలయ్య నటించారు. మొత్తానికి ఈ సినిమాలో సిద్దయ్య పాత్రను మరింత రంజుగా తీశారు. మొదట్లో పాట ఉంటుందని అనుకోలేదు. కానీ, బాలయ్య అభిమానుల కోసం.. ఓ డ్యూయెట్‌ను కూడా పెట్టారు. ఇది సక్సెస్ అయింది. ఇదీ.. అన్నగారి ప్రయోగం అంటే..!