MoviesTL రివ్యూ: లియో… LCU మ్యాజిక్ ఇలా అయ్యిందేంటి..!

TL రివ్యూ: లియో… LCU మ్యాజిక్ ఇలా అయ్యిందేంటి..!

టైటిల్‌: లియో
నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ మరియు మిస్కిన్ తదితరులు.
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్‌: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
నిర్మాతలు: S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
దర్శక‌త్వం : లోకేష్ కనగరాజ్
రిలీజ్ డేట్‌ : అక్టోబరు 19, 2023

ప‌రిచ‌యం:
ఖైదీ – విక్రమ్ – మాస్టర్ సినిమాలతో భారతీయ సినిమా పరిశ్రమంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌. ఇక విజయ నటించిన పలు తమిళ సినిమాలు ఇటీవల వరుసగా తెలుగులో విడుదలవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన మాస్టర్ సినిమా మెప్పించగా ఇప్పుడు లియో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటూ ప్రచారంతో భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లియో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? విజయ్ – లోకేష్ కాంబినేషన్ మెప్పించిందా అన్నది సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
పార్తీ ( విజయ్ ) హిమాచల్ ప్రదేశ్ లో స్థిరపడిన తెలుగువాడు. ఓ కేఫ్‌ను నడుపుకుంటూ అక్కడే కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. అతని భార్య సత్య ( త్రిష‌). వీరిది ప్రేమ వివాహం.. వీరు ప్రేమకు గుర్తుగా ఓ బాబు, పాపా కూడా ఉంటారు. హాయిగా సంతోషంగా సాగిపోతున్న పార్తీ జీవితం ఓ క్రిమినల్ ముఠా వల్ల తల కిందలవుతుంది. ఓ రాత్రి తన కేఫ్‌లోకి వచ్చి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ ముఠాను అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు. దీంతో పోలీసులు పార్తీని అరెస్టు చేస్తారు. అతడు తన ఆత్మ రక్షణ కోసమే వాళ్ళని చంపినట్టు కోర్టులో తేలడంతో నిర్దోషిగా రిలీజ్ అవుతాడు.

కానీ ఓ వార్తాపత్రికలో అతని ఫోటో చూసిన ఆంటోనీ దాస్ ( సంజయ్ దత్) గ్యాంగ్ పార్తీని వెతికి పట్టుకుని చంపేందుకు హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరుతుంది. దీనికి కారణం 20 యేళ్ల‌ క్రితం కనిపించకుండా పోయిన ఆంటోనీ కొడుకు లియోలా పార్తీ ఉండటమే. మరి ఈ లియో ఎవరు ? సొంత కొడుకుని చంపాలని ఇటు లియో తండ్రి ఆంటోనీ, అతడి అన్న హెరాల్డ్‌ దాస్ ( అర్జున్ ) ఎందుకు ప్రయత్నిస్తుంటారు. వీళ్ళకు లియోకు ఉన్న వైరం ఏంటి ? పార్తీ గతం ఏంటి అంటోనీ గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పార్తీ ఏం చేశాడు అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఇది లోకేష్ కనగ‌రాజ్‌ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సినిమా అయినా ఖైదీ, విక్రమ్ కథలతో దీనికి పెద్దగా లింక్ ఉండదు. ఈ కథ వాటికి పూర్తి భిన్నంగా సాగుతుంది. ఖైదీలో ఉన్న నెపోలియన్ పాత్రను దీంట్లో చూపించడం.. అంటోనీ దాస్ టీమ్ చేసే పొగాకు వ్యాపారం ఆఖరిలో విక్రమ్ గా కమలహాసన్ ఫోన్లో మాట్లాడటం వంటి కొన్ని అంశాలే ఇది లోకేష్ యూనివర్సల్ లో భాగం అనిపించేలా చేస్తాయే తప్ప మిగిలిన కథనంతో ఎక్కడ ఆ ఛాయలు కనిపించవు. ఓ క్రిమినల్ ముఠా ఒక కలెక్టర్ ను హత్య చేసి తప్పించుకునే ఎపిసోడ్తో సినిమా చాలా ఆసక్తిగా ప్రారంభమవుతుంది. ఆ వెంటనే హైనాతో పార్తీ తెలపడే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయి.

అక్కడ నుంచి పార్తీ కుటుంబాన్ని భార్యా, పిల్లలతో అతడి అనుబంధాన్ని చూపిస్తూ సినిమాను ముందుకు నడిపిస్తాడు దర్శకుడు. దీంతో సినిమా కాస్త స్లో అయినట్టు కనిపిస్తుంది. వెంటనే పార్తీ కేసులోకి క్రిమినల్ ముఠా ప్రవేశించి ప్రవేశించడం పార్టీ వారితో తలపడటం కూతురిని కాపాడుకునే క్రమంలో వాళ్ళని కాల్చి చంపటం ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఆకట్టుకుంటుంది. అక్కడ నుంచి కథ మలుపులు తిరుగుతుంది.. లియోని వెతుక్కుంటూ ఆంటోని దాస్ హిమాచల్ ప్రదేశ్ కు వచ్చినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. సంజ‌య్‌ద‌త్‌, అర్జున్‌లను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తొలిసారి పార్తీ – ఆంటోనీ ఎదురుపడే సన్నివేశాలు అదిరిపోతాయి.

విరామానికి ముందు వచ్చే రెండు ఫైట్లు కూడా అలరిస్తాయి. ఆంటోనీకి పార్తీకి మధ్య వచ్చే చేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుంది. పార్తీ, లియో ఒక్కరా ఇద్దరా అనే లైన్ చుట్టూ సెకండాఫ్ అంత సాగుతుంది. లియోకు తండ్రి, అన్నతో ఎందుకు గొడవ వచ్చింది అన్న కథ అంత ఆసక్తిగా అనిపించదు. ప్రీ క్లైమాక్స్‌లో తన భార్య బిడ్డలను చంపడానికి ఆంటోనీ దాస్ గ్యాంగ్ ను పార్తీ తన ట్రాప్‌తో చంపే తీరు ఆకట్టుకుంటుంది. విక్రమ్, ఖైదీ సినిమాల క్లైమాక్స్‌లో ఉన్నంత మెరుపు ముగింపు ఈ సినిమాలో కనిపించదు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
విజయ్ ఇందులో పార్తీ, లియోగా రెండు కోణాల‌లో ఉన్న పాత్రలో కనిపించారు. ఈ రెండిటికి మధ్య తేడాను దర్శకుడు చక్కగా ప్రజెంట్ చేశాడు. ఇద్దరు పిల్లలు తండ్రిగా పార్తీ పాత్రలో విజయ్ కనిపించిన తీరు, లుక్కు గెటప్ ఆకట్టుకుంటాయి. లియోగా నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్రలో చక్కగా హీరోయిజం చూపించారు. తల్లి పాత్రలో త్రిష చక్కగా ఒదిగిపోయింది. విజయ్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఆంటోనీ దాస్‌గా సంజయ్, హెరాల్డ్‌దాస్‌గా అర్జున్ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. వాళ్ళ పాత్రలని దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది. అయితే ఆ పాత్రలని ముగించిన తీరు సంతృప్తిగా లేదు.

ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ చాలా బాగా నటించాడు. మన్సూర్ ఆలీ ఖాన్ – ప్రియ ఆనంద్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. లోకేష్ ఈసారి తన కథలో యాక్షన్ డోస్‌ కాస్త తగ్గించి ఫ్యామిలీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క‌థ స్టార్టింగ్ తో పాటు ఫ‌స్టాప్ నడిపిన తీరు అదిరిపోయింది. సెకండాఫ్ లో చాలా సీన్లు సాగదీసినట్టు అనిపిస్తుంది. సంజయ్ దత్ బిహేవియర్ ..ఆయన నడవడిక అంతగా ఎట్రాక్ట్ కాదు.. చివరలో విక్రమ్ ( కమలహాసన్ ) ఫోన్ చేసి మాట్లాడినట్టు చూపించారు. కానీ అది అంతగా ప్రేక్షకులకు కిక్‌ ఇవ్వలేదు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
అనిరుధ్‌ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలైట్. యాక్షన్ సీన్లలో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కారు చేజింగ్ సీన్లు… దాస్ అండ్ కో కంపెనీని లియో తగలబెట్టే ముందు వచ్చే ఫైట్ షాట్లు అయితే వావ్ అనిపిస్తాయి. ఆకట్టుకుంటాయి. ప్రతి యాక్షన్స్ సీన్ డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేసుకున్నారు. గ‌న్‌ను చేతి పై రోల్ చేస్తూ విజయ్ చేసే గెశ్చ‌ర్‌కు థియేటర్లో విజిల్స్ పడతాయి. నిర్మాణ విలువ‌లు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా…
ఖైదీ, విక్ర‌మ్ మెరుపులు లేక‌పోయినా యాక్ష‌న్‌తో మెప్పించే లియో..

లియో రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news