తెలుగు వాళ్ళలో ముఖ్యంగా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో కులపిచ్చి ఉంటుంది అన్నది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో ఇది మారుతుంది. కమ్మలు.. కాపులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రాయలసీమలో రెడ్లు.. కమ్మలు వియ్యం అందుకుంటున్నారు. బీసీల్లో పలుకులాలు బీసీల్లోనే ఇతర కులాల వారిని వివాహం చేసుకుంటున్నారు. మరో 10 ఏళ్లలో ఈ కుల పిచ్చి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అనేది వాస్తవం.
కానీ ఓట్ల కోసమో.. తమ పబ్బం గడుపుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు కావచ్చు.. కొన్ని బూతు సోషల్ మీడియా వెబ్సైట్లు కావచ్చు సినిమా టైటిల్స్‌కు కూడా కులపిచ్చి అంటగట్టేస్తున్నాయి. ఇది ఎంత పైత్యమో వారికే తెలియాలి. ఇటీవల పెదకాపు అనే సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలో విషయం ఉందని అందరూ అనుకున్నారు.. కానీ ఓపెనింగ్ టికెట్లు తెగలేదు. సినిమా విడుదలైన తర్వాత కూడా బాగుంది అన్న టాక్ వచ్చింది. ఎందుకో సినిమా అంచనాలు అందుకోలేదు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు పెదకాపు అనే టైటిల్ భయంకరంగా మైనస్ అయింది అని కొందరు బూతు వెబ్సైట్ల వాళ్ళు వార్తలు రాస్తున్నారు. ఆ వెబ్సైట్లకు కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే వార్తలు రాస్తే కానీ పొద్దు పొడవదు.. పెదకాపు అంటే కాపు సామాజిక వర్గ సినిమా అని ఆ టైటిల్ పెట్టడం వల్ల అసలు ఓపెనింగ్స్ రాలేదని పిచ్చపిచ్చ వార్తలు రాస్తున్నారు. అందువల్లే జనం ఈ సినిమాకు దూరంగా జరిగిపోయారట.
మరి అదే అయితే అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి ఆ తర్వాత ఆయన కుమారుడు చేసిన సమరసింహారెడ్డి – నరసింహనాయుడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చూసాం. మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి పేరుతో సినిమా చేస్తే మరీ సూపర్ హిట్ కాకపోయినా చాలామందిని ఆకట్టుకుంది. సరే అవన్నీ పాత రోజులు అని సరిపెట్టుకున్నా ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అందులోను చిరంజీవి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమాకు పోటీగా వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టారో చూశాం. మరి నిజంగా సినిమా టైటిల్స్ విషయంలో కుల ప్రభావం ఉంటే వీర సింహారెడ్డి కూడా అట్టర్ ప్లాప్ అవ్వాలి కదా..! ఇవన్నీ తెలియకుండా పెద్దకాపు సినిమాకు కులపిచ్చి అంటగట్టి బురద జల్లటం.. ఆ కారు కూతలు కూసి కులాల మధ్య కుంపట్లు రాజేసే వెబ్సైట్ కి చెల్లిందని చెప్పాలి.