నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా కెరియర్ లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో బిగోపాల్ దర్శకత్వంలో 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డి మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు గోపాల్ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తర్వాత ఏడేళ్లకు సమరసింహారెడ్డి సినిమా వచ్చింది. ఆ తర్వాత నరసింహనాయుడు సినిమా కూడా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక సమరసింహారెడ్డి అప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులను క్రాస్ చేసింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. సమరసింహారెడ్డి సినిమా సక్సెస్ అయ్యాక తెలుగులో యాక్షన్ సినిమాలు వరుసగా క్యూ కట్టాయి. ఈ సినిమాను శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు నిర్మించారు. ఈ సినిమా కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ నుంచి 30 కథలకు పైగా విని ఫైనల్‌గా ఈ స్టోరీని సెలెక్ట్ చేశారు గోపాల్.
అప్పటివరకు యాక్షన్, ఫ్యామిలీ స్టోరీలు ఆదరించిన ప్రేక్షకులు సమరసింహారెడ్డి లాంటి ఫ్యాక్షన్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఆరు కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమా ఆరోజుల్లోనే రు. 20 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాలో సిమ్రాన్ – అంజలి జవేరి – సంఘవి హీరోయిన్లుగా నటించారు. 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన సమరసింహారెడ్డి మూడు థియేటర్లలో 225 రోజులు నడిచింది. కొన్ని కేంద్రాలలో ఏడాదికి పైగా సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా బాలయ్యను అనుకోలేదట.
దర్శకుడు గోపాల్ వెంకటేష్‌కు స్టోరీ వినిపించగా అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రక్త తిలకం – బొబ్బిలి రాజా – చినరాయుడు సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. అయితే వెంకటేష్ కథ మొత్తం స్టోరీ చాలా బాగుంది.. ఈ స్టోరీని ఎవరైనా మాస్ హీరో చేస్తే ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చాడట. ఈ కథ నాకు సెట్ కాదని వెంకటేష్ చెప్పడంతో అప్పుడు గోపాల్.. బాలయ్యను చెన్నైలో కలిసి కథ వినిపించడం.. ఆయన ఓకే చెప్పటం ఈ సినిమా పట్టాలు ఎక్కటం జరిగిపోయాయి. ముందుగా ఈ సినిమాకు సమరసింహం అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు సమరసింహారెడ్డిగా మార్చారు.