Moviesఅనన్య నాగళ్ల ‘తంత్ర’రివ్యూ

అనన్య నాగళ్ల ‘తంత్ర’రివ్యూ

బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల, భువన్ సాలూరు తదితరులు
సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
విడుదల తేదీ: 15,మార్చి 2024.

చిన్న సినిమా తీసి, రిలీజ్ చేయటమే ఓ హారర్ ఎక్సపీరియన్స్ ని ఇస్తోందంటారు మేకర్స్. ఏ క్షణం ఏ సమస్య వచ్చి పడుతుంది..ఇంతా కష్టపడి తీసిన సినిమా జనాలకు నచ్చుతుందో లేదో, ఓటిటి బిజినెస్ అవుతుందో లేదో ఇలా సినిమా ప్రారభ క్షణం నుంచీ కాళరాత్రే అని వాపోయే పరిస్దితి. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా చిన్న సినిమాలు లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. కొన్ని థియేటర్ మొహం చూసి హమ్మయ్య అనుకుంటే మరికొన్ని హిట్ అనిపించి ఊపిరి పీల్చుకుంటున్నాయి. స్టార్స్ లేని ఈ సినిమాలకు కాన్సెప్టే అన్ని. అదే నిజమని నమ్మి వచ్చిన తాజా చిత్రం ‘తంత్ర’.ఈ మధ్య కాలంలో కాస్తంత బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్ కూడా ఇదే. ప్రమోషన్స్ కాస్తంత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూ హైప్ ని పెంచడంతో ఇలాంటి సినిమాలను ఇష్టపడేవారి ద్రుష్టిని ఆకర్షించింది. మరీ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? తంత్ర లోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా ? ఇది నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టే కమర్షియల్ తంత్రమేనా చూద్దాం.

కథాంశం
పల్లెటూరు అమ్మాయి రేఖ (అనన్యా నాగళ్ల)కు ఎవరైనా దెయ్యాలు పట్టిన వాళ్లను చూసినా, చేతబడి జరిగిన వాళ్ళను చూసినా తెలిసిపోతూంటుంది. అయితే ఆమె కు తల్లి ఉండదు.తండ్రి ఉన్నా పెద్దగా ఆదరించడు. ఎప్పుడూ తిడుతూంటాడు. ఆమెకు బాల్య స్నేహితుడు కమ్ కాలేజీ ప్రెండ్ అంటే తేజా (ధనుష్ రఘుముద్రి). ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతూంటారు. ఆమె చర్యలు కొన్ని చూసి అతనికి ఆమెకు ఎవరైనా క్షుద్ర ప్రయోగం చేసారేమో అని సందేహపడతాడు. అతనా ఆ గొడవలో ఉండగా… ఆ ఊరిని ఎప్పుడో వదిలి వెళ్లిపోయిన విగతి (టెంపర్ వంశీ) వస్తాడు. అతను వచ్చి రేఖను తన కూతురే అని చెప్తూంటాడు. అసలు రేఖ ఎవరు..ఆమెకు ఎందుకు దెయ్యాలు ఎందుకు కనపడుతున్నాయి. ఆమె తల్లి రాజేశ్వరి (సలోని) ప్లాష్ బ్యాక్ ఏమిటి… రేఖకు నిజంగానే చేతబడి ఎవరైనా చేసారా..చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..
మనలోని భయం కూడా ఓ కమర్షియల్ ఎలిమెంటే అని గుర్తించి దాన్ని సరిగ్గా తెరపై ఎలివేట్ చేసిన సినిమాలు మాత్రమే ఆడతాయి. ఎందుకంటే ఈ జానర్ సినిమాలకు లిమిటెడ్ గా ప్రేక్షకులు ఉంటారు. భయపడటానికి, కథలో వచ్చే థ్రిల్ ఎంజాయ్ చేయడానికి టికెట్లు కొనుక్కొని మరీ వచ్చిన వారిని ఆ స్దాయిలో తృప్తి పరిస్తేనే మౌత్ టాక్ మొదలౌతుంది. హారర్ సినిమాల జోనర్ లో వచ్చి పాపులర్ అయిన సినిమాలన్ని ఎప్పటికప్పుడు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ఇచ్చినవే. మన తెలుగులో హారర్ సినిమాలకు తక్కువేం కాదు. అప్పటి ప్రేమకథా చిత్రమ్, నిన్న మొన్నటి గీతాంజలి వరకూ వాటి స్పూర్తిగా వచ్చి సక్సెస్ అయిన బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.

అయితే ఒక్కో సీజన్ లో ఈ హారర్ చిత్రాలు దాడి మొదలవుతుంది. చిన్న సినిమా అంటే.. ఆ మధ్య వరకూ హారర్ కామిడీ నే. చివరాఖరికి అల్లరి నరేష్ లాంటి కామిడీ హీరో కూడా భయపెట్టాడు. తెలుగు సినిమాలు సరిపోవు అన్నట్టు, తమిళం నుంచి కూడా దిగుమతి చేసుకున్నాం. అయితే ఆ జోనర్ కి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ప్యూర్ హారర్ ఫిల్మ్ లదే రాజ్యం. నికార్సయిన ఒక్క హారర్ సినిమా అయినా రాకపోతుందా అని వాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా చేసిందనాలి. ఫస్టాఫ్ సోసోగా నడిపినా సెకండాఫ్ కు వచ్చేసరికి కథ ఊపందుకుంటుంది. హీరోయన్ తల్లి (సలోని) ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కొత్తగా అనిపిస్తుంది. బాగా డిజైన్ చేసారు. ఈ రెండు ఎపిసోడ్స్ ని నమ్ముకనే సినిమా చేసారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంకాస్త స్క్రిప్టు బాగా చేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఏదైమైనా తొలిచిత్రానికి ఇలాంటి కాన్సెప్ట్ రాసుకున్న ద‌ర్శ‌కుడికి.. దాన్ని న‌మ్మి చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టిస్ట్‌ లకు, నిర్మాత‌కు చాలా ధైర్యం కావాలి. ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌ర్నీ అభినందించాల్సిందే. అలాగే ఎలాంటి కథ అయినా స‌రే దాన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోతే ప్రయోజనం ఉండదు. బ‌ల‌మైన క‌థ‌, దాని చుట్టూ ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటేనే.. చూసేవాళ్లని సీట్ల‌కు అతుక్కునేలా చేయ‌గ‌లుగుతారు. ఈ చిత్ర విష‌యంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న ట్విస్ట్ లు చాలావరకు వర్క్ అవుట్ అయ్యాయనే చెప్పాలి.

టెక్నికల్ గానూ….ఈ సినిమా అద్బుతం అని చెప్పలేం కానీ ఆ బడ్జెట్ కు బాగానే వర్కవుట్ చేసారనిపిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమరా వర్క్ కూడా నేచురాలిటీ తెచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. సినిమాకు ఇంకాస్త ఖర్చు పెడితే మరింత మంచి అవుట్ ఫుట్ వస్తుందనిపిస్తుంది. డైరక్టర్ కొత్త అయినా ఆ తడబాటు ఎక్కడా కనపడదు. నటీనటుల్లో అనన్య నాగళ్ల బాగా చేసింది.

చూడచ్చా….
కొత్త తరహా హారర్ ఎలిమెంట్స్ ని ఎంజాయ్ చేయటానికి ఈ సినిమా మంచి ఆప్షన్. తంత్రానికి సంభందించిన ఎన్నో ప్రాధమిక అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి.

Rating:2.75

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news