త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తారా ? అని అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తోన్న వేళ మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. మహేష్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్‌లో నటిస్తోన్న సినిమా కావడం.. బాహుబలి 1,2, ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు మామూలుగా లేవు.
తాజాగా ఈ సినిమాకు కథ అందిస్తోన్న రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా స్క్రిఫ్ట్ వర్క్ పూర్తయినట్టు చెప్పారు. మహేష్ – రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్‌లా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రాజెక్టు టైటిల్ గురించి మాట్లాడుతూ టైటిల్ విషయంలో తాము ఇంకా ఏం అనుకోలేదని.. ఈ సినిమా కథ ఎక్కువుగా అడవి నేపథ్యంలోనే ఉంటుందని కూడా చెప్పారు.
అలా అని ఇది పీరియాడికల్ మూవీ కాదని.. మహేష్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావాలన్న కోరిక ఈ ఒక్క సినిమాతోనే నెరవేరబోతోందని కూడా విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇక ఇండియానా జోన్స్ గురించి యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాల ద్వారా మొత్తం 15 వేల కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 1981లో రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్‌తో మొదలైన ఈ ప్రాంఛైజీలో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి.
ఈ సీరిస్‌లో వచ్చిన అన్ని సినిమాలకు ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించారు. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ కూడా స్పీల్‌బర్గే అన్నది తెలిసిందే. ఏదమైనా రాజమౌళి – మహేష్ సినిమా కథ అటవీ నేపథ్యంలో సాగుతూ ఇండియానా జోన్స్ సీరిస్ సినిమాల స్టైల్లో ఉండబోతోందన్నది క్లారిటీ వచ్చేసింది. ఇక రెండున్నరేళ్ల పాటు ఏకంగా ఫస్ట్ పార్ట్ షూటింగ్ నడుస్తుందని కూడా తెలుస్తోంది.