ఆమె అగ్ర తార. కమల్‌హాసన్ మూవీల్లో ఎక్కువగా హీరోయిన్‌గా చేసి.. మంచి పేరు కూడా తెచ్చుకుంది. పైగా తెలుగు అమ్మాయే అయినా.. తమిళంలోనే ఎక్కువగా స్థిరపడింది. అయితే.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలనే లక్ష్యంతో ఆమె అనేక మంది హీరోయిన్లకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేయడం గమనార్హం. ఒక్కొక్కసారి.. తను చేస్తున్న సినిమాలు పూర్తిచేసుకుని అర్థరాత్రుళ్లు కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా గాత్రం అందించింది.
ఆమే.. మరోచరిత్ర ద్వారా రికార్డు స్థాయిలో అభిమానులను సంపాయించుకున్న సరిత. ఈమె స్వస్థలం గుంటూరులోని మునిపల్లె. సరిత నటించిన ‘మరో చరిత్ర’ మూవీ ప్రేక్షకుల గుండెలను కదిలించింది. ఇందులో కమల్ హాసన్ సరసన హీరోయిన్‌గా నటించింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కావడంతో సరితకు తెలుగు, తమిళంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె నటించిన సినిమాలు గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయి.
అటు మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది సరిత. తెలుగులో మహేశ్‌బాబు అర్జున్ సినిమాలో పోషించిన ఆండాలు పాత్రకుగానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. నిజానికి సరిత అందంగా లేదని, ఆమె హీరోయినేంటని చాలామంది నవ్వుకున్నారు. కానీ అలా అవమానించినవా రితోనే చప్పట్లు కొట్టేలా చేసింది నటి.
సాధారణంగా ఒక సెలబ్రిటీ స్థాయికి రాగానే గర్వం తలకెక్కుతుందంటారు. కానీ సరిత మాత్రం ఎప్పుడూ అలా వ్యవహరించలేదు. ఇతర హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడానికి కూడా ఎప్పుడూ వెనుకాడలేదు. విజయశాంతి, సుహాసిని, మాధవి, సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, టబు, సుష్మితా సేన్, రోజా, రాధిక, ఆర్తి అగర్వాల్.. ఇలా ఎందరో తారలకు డబ్బింగ్ చెప్పింది. అమ్మోరు, మా ఆయన బంగారం, మావిచిగురు, అంతపురం సినిమాలకు డబ్బింగ్ చెప్పినందుకుగానూ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నాలుగు నందులు గెలుచుకుంది.