టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్‌మెంట్ సంస్థపై నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సంక్రాంతికి నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ కాకుండా వాయిదా వేసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి. మీటింగులు పెట్టి మరీ హనుమాన్‌ను వాయిదా వేసుకోవాలని కొందరు టాలీవుడ్ పెద్దలు బలవంతం చేశారు.
అయినా కూడా నిర్మాత నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. హనుమాన్ రిలీజ్ రోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సింగిల్ స్క్రీన్లలో హనుమాన్‌కు ఐదారు థియేటర్లు మాత్రమే ఇవ్వడం.. అందులోనూ 3 లాగేసుకోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు హనుమాన్‌ను తొక్కేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ రివర్స్ అయ్యాయి.
ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మధ్యలో పోటీగా రిలీజ్ అయ్యి కూడా హనుమాన్ ఈ యేడాది సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రు. 170 కోట్ల వసూళ్లు రాబట్టిన హనుమాన్ ఏ హైదరాబాద్‌లో అయితే కొందరు పనికట్టుకుని హనుమాన్‌కు థియేటర్లు లేకుండా చేశారో అదే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సూపర్ రికార్డ్ సొంతం చేసుకుంది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ సింగిల్ థియేటర్లో కేవలం 9 రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ రాబట్టింది. ఈ ఫీట్‌ను సంక్రాంతి పెద్ద సినిమాలు కూడా అందుకోలేదు. ఏదేమైనా హనుమాన్‌ను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేసిన వారికి హనుమాన్ సక్సెస్‌తోనే చెంపచెల్లుమనిపించారు సినీ లవర్స్.