టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పిచ్చిపిచ్చిగా అభిమానించే హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. ఈ లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వీళ్ళలో సీనియర్ హీరోయిన్లు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి.. ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టం అని ఆయనతో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా సినిమాలు చేసిన కాజల్ కూడా అదే మాట చెబుతోంది. టాలీవుడ్లో తన ఫేవరెట్ కో స్టార్ ఎన్టీఆర్ అని చెబుతోంది.
మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు ? అని అడిగితే టెన్షన్ వచ్చేస్తుంది.. ఇలాంటివి చెప్పటం చాలా కష్టం అలా అడగటం కరెక్ట్ కాదు అంటూనే తమిళంలో విజయ్, తెలుగులో ఎన్టీఆర్ పేర్లు చెప్పేసింది. నిజానికి కాజల్.. ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టం అని చెప్పటం ఇదే మొదటిసారి కాదు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయనతో నటించినప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉంటానని గతంలో ఎన్నోసార్లు చెప్పింది. ఇండస్ట్రీలో తనకు ఉన్న అతి కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఎన్టీఆర్ కూడా ఒకడని వెల్లడించింది.
విచిత్రం ఏంటంటే ఈ స్నేహం వల్లే ఎన్టీఆర్ అడిగిన వెంటనే జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది కాజల్. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పై తన అభిమానం చాటుకుంది. అసలు కాజల్ ఎన్టీఆర్‌ను అంతలా ఇష్టపడటానికి కారణం ఏంటన్నది చూస్తే ఆసక్తికర విషయం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. టెంపర్, బృందావనం, బాద్ షా, జనతా గ్యారేజ్‌లో స్పెషల్ సాంగ్ చేస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అసలు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ప్లాప్ కూడా రాలేదు. ఇంత లక్కీ హీరోయిన్ ఎన్టీఆర్‌కు ఎవ్వరూ లేరు. ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలు కాజల్ కెరీర్‌ను మంచి స్వింగ్‌కు తీసుకు వెళ్లాయి. వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా వచ్చిన బృందావనం సూపర్ హిట్, ఆ తర్వాత బాద్షా బ్లాక్ బస్టర్, టెంపర్ కూడా ఎన్టీఆర్ వరుస ఫ్లాప్‌లకు చెక్ పెట్టింది. ఇక జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం. ఈ సినిమాలన్నీ కాజల్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అందుకే ఎన్టీఆర్ పై కాజల్ ఎప్పుడు స్పెషల్ అభిమానం చూపిస్తూ ఉంటుంది.