టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్, డబ్బు ఆశకు పోయి టాలీవుడ్ను డేంజర్ జోన్ లోకి నెట్టేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. వాళ్లను స్టార్ హీరోలను చేసింది తెలుగు సినీ ప్రేక్షకులు. అయితే వాళ్లు తెలుగు సినీ అభిమానులకు వినోదం పంచేందుకు కనీసం యేడాదికి ఒక సినిమా కూడా చేయటం లేదు. పాన్ ఇండియా మార్కెట్ కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ లకు ఆశపడి రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. 2023 బాక్సాఫీస్ చాలా నిస్సారంగా ముగుస్తోంది.
చాలామంది స్టార్ హీరోలు.. మిడిల్ రేంజ్ హీరోలు ఈ సంవత్సరం సినీ లవర్స్ కు హ్యాండ్ ఇచ్చారు. ఈ ఏడాది మహేష్ నుంచి సినిమా రాలేదు. సర్కారీ వారి పాట సినిమా తర్వాత దాదాపు 20 నెలలకు పైగా సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. షూటింగ్ డిలే అవ్వడం.. వ్యక్తిగతంగా కూడా మహేష్ తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల మహేష్ కు ఈసారి ఇబ్బంది తప్పలేదు. మహేష్ ఆలస్యాన్ని మనం తప్పుపట్టలేం.
ఆర్. ఆర్.ఆర్ లాంటి బిగ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లలేదు. దీంతో వీరిద్దరి నుంచి 2023 లో ఒక్క సినిమా కూడా రాలేదు. అల్లు అర్జున్ పరిస్థితి మరీ దారుణం గత రెండు సంవత్సరాలు క్యాలెండర్ ఇయర్లో ఒక్క సినిమా కూడా లేదు. పుష్ప 2 కూడా వచ్చే యేడాది ఆగస్టు కానీ రాదు అంటున్నారు అంటే ఒక్క సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాల టైం తీసుకున్నాడు. పుష్ప తర్వాత మార్కెట్ పెరగడంతో రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా మార్కెట్ అంటూ బన్నీ సినిమాల విషయంలో చాలా ఆలస్యం చేస్తూ అభిమానులను బాగా నిరుత్సాహపరుస్తున్నాడు.
శర్వానంద్, నాగార్జున, వెంకటేష్, రానా లాంటి హీరోలు వరుస ప్లాపుల నేపథ్యంలో సరైన కథలు లేక గ్యాప్ తీసుకోడంతో వీరి నుంచి కూడా ఈ యేడాది క్యాలెండర్ ఇయర్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏదేమైనా పైన చెప్పుకున్న హీరోల్లో ఒకరిద్దరిని మాత్రం మినహాయిస్తే మిగిలిన హీరోలు భారీ రెమ్యునరేషన్లు, పాన్ ఇండియా మార్కెట్ అంటూ రెండేళ్లకు కూడా ఒక్క సినిమా కూడా చేయకుండా టాలీవుడ్‌ను డేంజర్ జోన్‌లో పడేస్తున్నారు. పేరుకు మాత్రం వీళ్లు పెద్ద హీరోలు కనీసం యేడాదికి రెండు సినిమాలు కూడా చేయకుండా… థియేటర్లకు సరైన ఫీడింగ్ లేకుండా నాశనం చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.