Newsసురేష్ కొండేటి ని సైడ్ చేసేసిన మెగా ఫ్యామిలీ... ఆ ఆట‌ల‌కు...

సురేష్ కొండేటి ని సైడ్ చేసేసిన మెగా ఫ్యామిలీ… ఆ ఆట‌ల‌కు ఇక బంద్‌…!

ఓవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల మీద అందరూ దృష్టి పెట్టి ఉన్న వేళ గోవాలో జరిగిన సంతోషం అవార్డుల గజిబిజి గడబిడ టాలీవుడ్ లో ఆసక్తి రేపింది. సంతోషం అవార్డుల నిర్వహకుడు సంతోషం సురేష్ తొలిసారిగా భారీ ఎత్తున గోవాలో ఈ అవార్డుల ఉత్సవాన్ని తలపెట్టారు. ఏకంగా గోవా ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దక్షిణాది భాషల సినిమా అవార్డులతో పాటు ఓటీటీ అవార్డులు కూడా ఇవ్వాలని అనుకున్నారు. హైదరాబాదు నుంచి భారీగా సినిమా సెలబ్రిటీలను తరలించాలని ప్లాన్ చేశారు. కానీ ఫంక్షన్ మొత్తం అబాసుపాలై టాలీవుడ్ పరువు పోయే వరకు వచ్చేసింది. ఇతర భాషలకు చెందిన సినిమా అభిమానులు టాలీవుడ్‌ను సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు.

పైగా ఇక్కడ నుంచి వెళ్లిన సినిమా జనాలకు కూడా అక్కడ చేదు అనుభవాలు ఎదురైనట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు అవార్డులు ఇవ్వడం ముగిసిన వెంటనే వేదిక మీదకు వెళ్లే స్టెప్స్ తీసివేయటం.. లైట్లు ఆరిపోవడం లాంటి సంఘటనలు జరిగాయని.. పేమెంట్లు ఇవ్వకపోవడం వల్లే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. సందట్లో సడే మియా అన్నట్టు హోటల్ నుంచి అవార్డుల ఫంక్షన్ జరిగే ప్రదేశానికి వెళ్లే ఏర్పాట్లు స‌రిగా లేవ‌ని… అతిధులను తీసుకువెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు కూడా తమకు పేమెంట్లు ఇవ్వలేదని గొడవ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భారీరేట్లకు రిటర్న్ ఫ్లైట్‌ టికెట్లు వేసుకొని కొంతమంది వెనక్కి వచ్చారట.

అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ లాంటివాళ్ళు కూడా కొన్ని పేమెంట్లు చేయాల్సి వచ్చిందని చివరకు సీనియర్ నటుడు మురళీమోహన్ లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారని కన్నడ నటులు బస‌ చేసిన హోటల్ బిల్లులు కూడా చెక్ అవ్వలేదని అంటున్నారు. ఇక యాంకర్ సుమ కూడా ఫంక్షన్ జరుగుతుండగా సగంలోనే స్టేజి దిగి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఇక అవార్డులకు సంబంధించిన సిబ్బంది కొందరు అక్కడ ఇరుక్కుపోయారని.. ఆదివారం సాయంత్రం దాటాక బిల్లులు పే చేయడంతో వాళ్లు వెనక్కి బయలుదేరారని తెలుస్తోంది. ఇప్పటివరకు సంతోషం సురేష్ హైదరాబాదులో ఈ అవార్డుల ఫంక్షన్ నిర్వహించేవారు.. దీంతో సెలబ్రిటీలు ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ కార్లలో అక్కడికి వచ్చేవారు. సురేష్‌కు పెద్ద‌గా ఖ‌ర్చు కూడా అయ్యేదే కాదు.

అయితే తొలిసారిగా గోవాలో ఈ ఫంక్షన్ పెట్టాలని సంతోషం సురేష్ భాగించారు. అక్కడ ప్లానింగ్ మిస్సయింది. గోవా కావడంతో భారీ ఖర్చు.. మ్యాన్ పవర్ అనుభవం సరిపోలేదు. దీంతో ఫంక్షన్ ప్లాప్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై సంతోషం సురేష్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఇంత భారీ ఫంక్షన్ అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయని ..ఆలస్యంగా కార్యక్రమం మొదలవడం వల్లే గోవా ముఖ్యమంత్రి రాలేదని.. ఇక తాను ప్రతి ఒక్కరికి టికెట్లు వేశానని.. చాలామంది టైం మార్చడం వల్ల తనకు 40 లక్షలు అదనంగా ఖర్చయిందని.. తాను తీసిన టిక్కెట్లు వాడుకోకుండా వేరే టైంలో టికెట్లు వేసుకుంటే తానం చేస్తానని అన్నట్టు కూడా తెలుస్తోంది.

ఇక ఒకరిద్దరు స్పాన్సర్లు కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బంది తలెత్తినట్లు ఆయన చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటివరకు సురేష్ కొండేటికీ మెగా ఫ్యామిలీ పర్సనల్ పీఆర్వోగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆయన సొంత పిఆర్ఓ అని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. తాజాగా సంతోషం అవార్డులు ఫంక్షన్ గజిబిజిగా మారిన నేపథ్యంలో అల్లు అరవింద్ స్పందించారు. సురేష్ అవార్డుల ఫంక్షన్ ఈసారి గోవాలో నిర్వహించాడు.. కొన్ని కారణాలవల్ల ఫెయిల్ అయ్యాడు.. సరిగ్గా చేయలేదు.. అక్కడికి వెళ్లిన వారు ఇబ్బంది పడ్డారు.. అయితే మీడియా మొత్తం మా కుటుంబానికి చెందిన వ్యక్తులకు పిఆర్వో అని రాస్తున్నారు… ఆయన మా పిఆర్ఓ అని రాయటం కరెక్ట్ కాదు.. పైగా అతడు నిర్వహించిన ఫంక్షన్ వల్ల ఇతర భాషల వారికి కూడా ఇబ్బందులు కలిగాయి.. వారు కూడా తెలుగు ఇండస్ట్రీని విమర్శిస్తున్నారు.. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం సరికాదన్నారు.

సురేష్ మా కుటుంబంలో ఎవరికీ పిఆర్ ఓ కాదు అని.. అది ఆయన పర్సనల్ ఫెయిల్యూర్ అని అరవింద్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఎప్పటి వరకు మెగా ఫ్యామిలీ పిఆర్ఓ గా ప్రచారంలో ఉన్న సురేష్ కు అల్లు అరవింద్ చేసిన కామెంట్లు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇప్పటినుంచి ఆయన మెగా ఫ్యామిలీ లేదా చిరంజీవి పర్సనల్ పిఆర్ ఓ అని ప్రచారం చేసుకునే అంత సీన్ లేదు. సురేష్ ఇప్పటికే కొన్ని సినీ ప్రెస్మీట్ల‌లో కాంట్రవర్సీ ప్రశ్నలతో విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ఆయన సంతోషం అవార్డుల ఫంక్షన్ ఫెయిల్యూర్ మ‌రింత‌ మైనస్ గా మారింది అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news