ఆటైనా.. అభినయం అయినా.. మెరుపు కళ్ళ సుందరి సిల్క్ స్మిత స్టైలే వేరు. ఆమె సినిమాలో ఉందంటే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది. థియేటర్లో హౌస్ఫుల్.. ఈమె బయోపిక్ కూడా తెరపై మెరిసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. అలాంటి చరిత్ర కలిగిన సిల్క్ స్మిత ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా.. ఆమె నటిగా ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు.
సిల్క్ స్మితకు ఎలాంటి క్రేజ్ ఉందంటే.. తాజాగా ఆమె 63వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ అభిమాని వందమందికి బిర్యాని పంచిపెట్టి ఆమెపై ఉన్న తరగని అభిమానాన్ని చాటుకున్నాడు. సిల్క్ స్మిత జీవిత చరిత్ర బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కి సంచలన విజయం సాధించింది. అందులో విద్యాబాలన్ ఆమె పాత్రలో నటించారు. అలాగే మలయాళంలోనూ ఒక సినిమా తెరకెక్కింది. అందులో నటి సనాఖాన్ నటించారు. తాజాగా సిల్క్ అన్ టోల్డ్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది.
ఇలా తరం మారుతున్నప్పుడల్లా దర్శక, నిర్మాతలు పేరు డబ్బు సంపాదించుకునే అంత గొప్ప పేరు సిల్క్ స్మిత సంపాదించుకుని చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సిల్క్ స్మితను ఎక్కువ మంది దర్శక, నిర్మాతలు శృంగార తారగానే చూశారు. ఆమెలో మంచి నటి కూడా ఉన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా ఆమె నటనను మెచ్చుకున్నారు. ఆమె శృంగార పాటల్లో నటించడం మానేసి మంచి క్యారెక్టర్లలో నటించాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక సిల్క్ స్మిత జయంతి సందర్భంగా లోకనాయకుడు కమలహాసన్ గతంలో మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను హీరోగా నటించిన సినిమాలో ముందుగా సిల్క్ స్మిత పాట లేదు.. అయితే ఆమె సినిమాలో ఉంటే కాసుల వర్షం కురుస్తుందని కావాలని ఆమె పాటలు పెట్టారు.. దర్శకుడు బాలు మహేంద్ర. చాలా తక్కువ ఖర్చుతో ఆ పాటను చిత్రీకరించారు.
ఆ పాటకు ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. సిల్క్ స్మితకు నిజంగానే డ్యాన్స్ చేయటం రాదు. ఆమె ఇతరులను ఇమిటేట్ చేయటంలో పెద్ద ఖిలాడి. అదే సమయంలో ఫ్యాషన్‌కు తగినట్టుగా దుస్తులు ధరించడం ఆమెకు ఇష్టం. ఇదే విషయాన్ని తాను ఆమెతో చెప్పి ప్రశంసించానని.. ఆమె చాలా కష్టాలు పడి ఎదిగిన నటి అని కమల్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.