MoviesTL రివ్యూ : యానిమల్ .. పిచ్చెక్కించాడు..!

TL రివ్యూ : యానిమల్ .. పిచ్చెక్కించాడు..!

టైటిల్‌: యానిమల్
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీ తదితరులు
మ్యూజిక్‌: ప్రీతమ్-విశాల్ మిశ్రా-మనన్ భరద్వాజ్- శ్రేయస్ పురాణిక్- హర్షవర్ధన్ రామేశ్వర్- జానీ- ఆశిమ్- గురిందర్ సెగల్
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్ర‌ఫీ: అమిత్ రాయ్
స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగ-ప్రణయ్ రెడ్డి వంగ- సురేష్ బండారు
నిర్మాతలు: భూషణ్ కుమార్- ప్రణయ్ రెడ్డి వంగ- మురాద్ ఖేతాని- కృష్ణ కుమార్
రచన- ఎడిటింగ్‌ – దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
రిలీజ్ డేట్‌: 1 డిసెంబ‌ర్‌, 2023

ప‌రిచ‌యం :
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా సంచలనం రేపిన‌ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా వచ్చాక మళ్లీ ఇన్నేళ్లకు ఓ కొత్త కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ సినిమా యానిమల్. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో జరిగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ?సమీక్షలో తెలుసుకుందాం.

క‌థ :
రణ్‌ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్) కి తన తండ్రి బల్వీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే ఎంతో పిచ్చి ఇష్టం. అయితే బల్వీర్ సింగ్ బిజీ బిజినెస్‌మాన్ భారతదేశంలోని పెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ బిజీ లైఫ్‌లో పడి తన కొడుకుతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేక పోతాడు. ఈ క్రమంలోనే జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తండ్రీ కొడుకు మధ్య దూరం పెరిగిపోతుంది. దీంతో కొడుకుని బోర్డింగ్ స్కూల్ కు పంపిస్తాడు తండ్రి. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో రణ్‌ విజయ్ సింగ్.. గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. అయితే తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని తిరిగి ఇండియాకు వస్తాడు. అసలు బల్వీర్ సింగ్ ను ఎవరు చంపాలనుకుంటున్నారు..? తన తండ్రి శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? అందుకోసం ఎలాంటి..? ఇబ్బందులు ఎదుర్కొన్నాడు తన ప్రేమ విషయంలో ఏం జరిగింది..? అన్నది మిగిలిన కథ.

విశ్లేష‌ణ :
అర్జున్ రెడ్డిని ఎవరో వ‌య‌లెంట్ ఫిలిం అన్నారని.. అసలైన వైలెన్స్ అంటే ఏంటో తన తర్వాత సినిమాలో చూపిస్తా అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. యానిమల్ సినిమాలో వైలెన్స్ చూసి వామ్మో వాయ్యో అనుకోకుండా ఉండలేం. వ‌య‌లెన్స్ అంటే కేవలం కత్తి, తుపాకీ పట్టి రక్తపాతం సృష్టించటం మాత్రమే కాదు. అందులో హీరో, హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న.. తండ్రితో ప్రేమగా మాట్లాడుతున్న.. తన అక్కకు ఒక భరోసా ఇవ్వాలని చూస్తున్న.. చివరకు తన బావతో వాదన పెట్టుకున్న.. అన్ని కూడా వయోలెన్స్ లాగే అనిపిస్తాయి. నిజంగా హింసాత్మక సన్నివేశాలు తెరమీద చూస్తున్నప్పుడు కూడా రాని ఒక భయం, ఒక గగుర్పాటు కలుగుతాయి. తెరపై ఒక రకమైన వలయాన్ని సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

అయితే ఇది కొందరికి అర్జున్ రెడ్డి సినిమాకి మించిన కిక్ ఇవ్వవచ్చు.. కానీ సగటు ప్రేక్షకులు భరించలేని ఓవర్డోస్ సీన్లు, డైలాగులు, ఈ సినిమా పరిధిని కొంచెం తగ్గించాయి. ట్రీట్మెంట్ పరంగా దర్శకుడు సందీప్ రెడ్డి మార్కు అడుగడుగునా కనిపిస్తుంది. సందీప్ రెడ్డి వేవ్‌ లెంత్ మ్యాచ్ అయ్యే ప్రేక్షకుడికి ఈ సినిమా వారెవా అనిపిస్తుంది. పరమ రొటీన్ కథ‌, నెమ్మదిగా సాగే కథనం, సుదీర్ఘమైన నిడివి, టూ మచ్ వయోలెన్స్ డైలాగుల వల్ల.. సగటు ప్రేక్షకులు యానిమల్ సినిమాను తట్టుకుంటారా అన్న డౌట్ రాక మానదు.

హీరో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి కొడుకు. అంతమాత్రాన అతడు చేసే విన్యాసాలు, విధ్వంసాలు మామూలుగా ఉండవు. కాలేజీలో చదివే తన అక్కను ఎవరో ఏడిపించారని తన స్కూల్ డ్రెస్ లోనే పెద్ద మిషన్ గన్‌ పట్టుకుని.. ఆమె క్లాస్ రూమ్ లోకి వెళ్లి టపా టపా బుల్లెట్లు పేల్చి అక్కడున్న వాళ్లకు వార్నింగ్‌ ఇస్తాడు. తన అక్కను ఏడిపించిన వాళ్ళను కారుతో గుద్ది పడేస్తాడు. 300 మంది ఒకేసారి గన్నులు, కత్తులు పట్టుకుని దాడికి వస్తే ఒక మిషన్ గన్‌ తయారు చేయించుకుని.. వాళ్ళందరి అంతు చూస్తాడు. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీ తీసిన సందీప్ రెడ్డి నుంచి వచ్చిన ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఇబ్బందికరంగా, ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి.

అయితే కమర్షియల్ గా సినిమా స్థాయి పెంచడానికి లాజిక్కులు పక్కన పెట్టేసి ఇలాంటి సీన్లు మీద దర్శకుడు సందీప్ రెడ్డి ఆధారపడ్డాడు. అయితే హీరో పాత్ర చిత్రీకరణంగా చూస్తే తన ముద్ర స్పష్టంగా చూపించాడు. అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగానే ఇందులో కూడా హీరో పాత్ర చుట్టూ, దాని ఆధారంగా కథ నడుస్తుంది. ఇక్కడ హీరో పిచ్చి ప్రేమ అమ్మాయి మీద కాదు.. తండ్రి మీద.. తండ్రి – కొడుకులు బంధం, భావోద్వేగాలను అనుకున్నంత బలంగా చూపించకపోయినా హీరో ప్రవర్తన చర్యలతో ఆ ఇంటెన్సిటీ ఫీల్ అవుతాం.

కథ‌పరంగా గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమీ లేకపోయినా.. ఇది ఒక సగటు రివెంజ్ డ్రామాలాగా అనిపించినా.. ట్రీట్మెంట్ సన్నివేశాల్లో కొత్తదనం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి చివరి వరకు నిలబడుతుంది. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు.. ఆ తండ్రి ప్రేమ దొరకకపోతే ఎంత..? వైలెంట్‌గా తయారవుతాడు అనేది దర్శకుడు కొన్ని సీన్ల‌లో బాగా చూపించాడు. విలన్లకంటే హీరోని చూస్తేనే అందరూ భయపడే రేంజ్ లో హీరో పాత్ర తీర్చిదిద్దాడు. అయితే సినిమా ఫస్ట్ ఆఫ్ లో చాలా స్లోగా ఉంది.. అనుకుంటే సెకండాఫ్ లో మరింత స్లో అవుతుంది. హీరో గాయపడి నెమ్మదించడంతో కథ కూడా స్లో అయినట్టు ఫీలింగ్ కలుగుతుంది.

విచిత్రం ఏంటంటే చివర రోలింగ్ టైటిల్స్ పడగానే కథ‌ ముగిసింది అనుకుంటాం. అక్కడినుంచి ఇంకో ట్విస్ట్ ఇచ్చి ఇంకా కొంత కథ నడిపించి మళ్లీ తన మార్కు చూపించాడు దర్శకుడు సందీప్. ఇది సినిమాకు కొసమెరుపులా ఉంటుంది. ఓవరాల్‌గా యానిమల్ పక్కా సందీప్ రెడ్డి మార్కు యాక్షన్ సినిమా. అర్జున్ రెడ్డి అంత పర్ఫెక్ట్ సినిమా కాదు.. కానీ దాన్ని మించిన వ‌యెలెన్స్‌, మ్యాడ్‌నెస్‌ ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, సంప్రదాయ సినిమా ప్రేమికులకు.. పెద్దగా రుచించదు అని చెప్పాలి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
నటీనటుల పరంగా రణ్‌బీర్ కపూర్ తన లైఫ్ టైం పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రణ్‌బీర్‌ నటన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా బర్ఫీ గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు యానిమల్ ప్రస్తావన తెస్తారు. ఈ పాత్రను ఇంత బాగా చేస్తాడా ? అనే స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు రణ్‌బీర్. ఈ సినిమాలో నటించే సమయంలో ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. రష్మిక ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తుంది. భర్త పడక మీదకి మరో అమ్మాయి వచ్చిందని తెలిసే సన్నివేశంలో ఆమె నటన.. రణ్‌బీర్‌కు ధీటుగా సాగింది. అనిల్ కపూర్ కథలో కీలకమైన పాత్రలో పతాక సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. విలన్ పాత్రలో ఓకే అనిపించాడు. అయితే ఆ పాత్ర అనుకున్న స్థాయిలో లేదు.. మిగిలిన నటీనటులు తెరనిండా కనిపించిన వాళ్ళ పాత్రలకు పరిమితం అయ్యారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా చూస్తే దర్శకుడు సందీప్ రెడ్డి ఎమోషనల్ గా బాగా తెర‌కెక్కించిన.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా యానిమల్ కథ‌ను రాసుకోలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమాలో చాలా సీన్లను అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న సాగదీత సీన్ల‌ను తగ్గించాల్సి ఉంది. సినిమా నిడివి బాగా ఎక్కువైంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు.

ఫైన‌ల్‌గా…
యానిమల్ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ నటన భారీ వైల్డ్ యాక్షన్ సీన్లు, బోల్డ్ ఎలిమెంట్స్, హెవీ ఎమోషన్లు, క్లైమాక్స్ బాగున్నాయి. సినిమాలో బలమైన ఎమోషన్ కాన్‌ఫ్లిక్ట్‌ ఉన్నా.. ఆ ఎమోషన్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా సరిగా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ తో పాటు.. బోల్డ్ కంటెంట్ ఇష్టపడే వారికి.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఇష్టపడే వారికి.. మాత్రమే ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. కుటుంబ కథ ప్రేక్షకులు సాంప్రదాయ సినిమాలు ఇష్టపడే వారికి ఇది అంతగా రుచించదు.

ఫైన‌ల్ పంచ్ : యానిమ‌ల్ అర్జున్‌రెడ్డిని మించిన మ్యాడ్‌నెస్‌

TL యానిమ‌ల్ రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news