టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఒకేసారి తమ సినిమాలతో పోటీపడినా పోరు మామూలుగా ఉండదు. సహజంగానే ఇద్దరి అభిమానులు.. తమ హీరో సినిమా పైచేయి సాధించాలని కోరుకుంటూ ఉంటారు. చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాక.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రి ఇచ్చారు. ఆ సినిమాకు పోటీగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అయింది. ఆ టైంలో ఇద్దరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వసూళ్లపరంగా చిరంజీవి సినిమా కాస్త పైచేయి సాధించింది.
మళ్ళీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలతో మరోసారి సంక్రాంతి కానుకగా పోటీపడ్డారు. ఈసారి కూడా అనూహ్యంగా ఇద్దరు హీరోల సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే వసూళ్లపరంగా వీరసింహారెడ్డి కంటే చిరంజీవి సినిమా పైచేయి సాధించింది. ఓపెనింగ్ డేపరంగా బాలయ్య సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు లాంగ్ రన్లో ఎక్కువ వసూళ్ళు వచ్చాయి. అయితే ఇద్దరు హీరోల సినిమాలు 150 రోజులు పాటు థియేటర్లలో ఆడాయి.
అయితే టెలివిజన్ పరంగా మాత్రం మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మీద బాలయ్య విజయాన్ని సొంతం చేసుకుని.. బెటర్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్నాడు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమా మొదటి టెలికాస్ట్ లో 8.83 టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకొని పరవాలేదు అనిపించుకుంది. అదే టైంలో వాల్తేరు వీరయ్య అందరికీ షాక్ ఇస్తూ కేవలం 5.14 టిఆర్పి రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. చిరంజీవి స్థాయి సూపర్ డూపర్ హిట్ సినిమాకు.. ఇది చాలా పూర్ టిఆర్పి రేటింగ్ అని చెప్పాలి.
అలాగే ఈ ఏడాది ఈ ఇద్దరు హీరోలు మరోసారి నెలరోజుల వ్యవదిలో తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. చిరంజీవి భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆయన కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిస్తే.. ఆ వెంటనే దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బాలయ్య వరుసగా మూడో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలా ఈ ఏడాది చిరంజీవిపై బాలయ్య రెండుసార్లు పైచేయి సాధించారు. అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెర మీద కూడా బాలయ్య సత్తా చాటారు.