ప్రభాస్ కెరీర్ లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్. కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్స్ గా నటించారు. తాప్సీ కెరీర్ లో కూడా హిట్ సినిమా అంటే తెలుగులో ఇదొక్కటే. సంతోషం సినిమా తీసి ఇండస్ట్రీలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో ప్రభాస్ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత అప్పగించారు.
వాస్తవానికి మిస్టర్ పర్‌ఫెక్ట్ చేయాల్సిన దర్శకుడు వివి వినాయక్. ఆది, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, బధ్రీనాథ్ లాంటి యాక్షన్ సినిమాలు తీసి ఉండటంతో ప్రభాస్ హీరో అనగానే వివి వినాయక్ అయితే బావుంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అలా దిల్ రాజు, వినాయక్‌ల మధ్య మిస్టర్ పర్‌ఫెక్ట్ కథా చర్చలు సాగాయి. మొత్తం కథ విన్న తర్వాత వినాయక్ దిల్ రాజుకి ఓ సలహా ఇచ్చాడు.
కథ చాలా బావుంది. ప్రభాస్ కి బాగా సూటవుతుంది. కానీ, నేను డైరెక్టర్ అయితే మాత్రం మొత్తం కథ ఫ్లేవర్ మారిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువవుతాయి. కథలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ ఎక్కువగా ఉంది. అది మారిపోతుంది అని దిల్ రాజుకి వినాయక్ సలహా ఇచ్చారు. దాంతో దిల్ రాజు సంతోషం సినిమాతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన దశరథ్ ని పిలిచి కథ చెప్పారు.
ఆయన కూడా బావుందని, అప్పటి వరకూ ప్రభాస్ చేసిన సినిమాలకి భిన్నంగా ఉండాలని మిస్టర్ పర్‌ఫెక్ట్ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ప్రభాస్ కి తగ్గట్టుగా సినిమా చేశారు. ఈ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత వినాయక్ చెప్పిన మాట నిజమని దిల్ రాజు ఒప్పుకున్నారు. ప్రభాస్ కెరీర్ లో టాప్ టెన్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా మిస్టర్ పర్‌ఫెక్ట్ ఉంటుంది.