టాలీవుడ్ కింగ్ నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్. ఆయన ఏ విషయం అయినా కమర్షియల్ కోణంలోనే చూస్తారన్న టాక్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. నీకెంత.. నాకెంత.. నా లాభం ఎంత అన్న లెక్కలే నాగార్జున దగ్గర ఎక్కువగా వినపడుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీ జనాలలో నాగార్జున మానవ సంబంధాల కన్నా.. ఆర్థిక సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పే ఇండస్ట్రీ జనాలు కూడా ఉన్నారు. నాగార్జున అన్నయ్య.. అక్కినేని వెంకట్ తన తమ్ముడితో కలిసి ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేవు.
నాగార్జున కెరీర్ ప్రారంభంలో అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు వెంకట్ చూసుకునేవారు. నాగార్జున నటించిన సినిమాలకు నిర్మాతగా కూడా వెంకట్ వ్యవహరించారు. తర్వాత ఏమైందో కానీ అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు మొత్తం వెంకట్ వదిలేసి వైజాగ్ వెళ్లి అక్కడ బిజినెస్ లో స్థిరపడిపోయారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్ని నాగార్జునతో పాటు మేనకోడలు యార్లగడ్డ సుప్రియ చూసుకుంటున్నారు.
అసలు ఇటీవల కాలంలో తన తమ్ముడు నాగార్జునతో కలిసి వెంకట్ కనిపించిన సందర్భాలు బహు తక్కువ. అయితే వెంకట్ చాలా రోజుల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. తాను, నాగార్జున ఇద్దరం కూడా ఇండస్ట్రీలో పెరగలేదు.. మేము బాగా చదువుకోవాలని చెప్పి నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతూ వచ్చారన్నారు. అప్పట్లో సినిమాలు గురించి మాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు.. సినిమా ఆలోచనలు నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదని వెంకట్ తెలిపారు.
తాను నిర్మాతగా మారటానికి.. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్న గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పామని.. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పారని.. అప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చేపట్టి నిర్మాతగా, నాగార్జున సినిమాల్లోకి వచ్చి హీరోగాను సినిమాలు చేసినట్టు వెంకట్ తెలిపారు. తాను చాలా కాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకున్నానని.. ఆ తర్వాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి తాను పక్కకు తప్పుకున్నట్టు తెలిపారు.
అక్కినేని వెంకట్ జనరేషన్ గ్యాప్ అని చెప్తున్నా ఇద్దరివి ఇప్పుడు వేరువేరు దారులు అయ్యాయని.. ఎవరి పంథాలో వారు ముందుకు వెళుతున్నారు అన్న చర్చలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇటు నాగార్జున నుంచి కూడా ఎప్పుడు తన అన్నప్రస్తావన కూడా పెద్దగా రాదు. అటు వెంకట్ సినిమా రంగానికి దూరమయ్యాక పూర్తిగా తన వ్యాపారం మీద దృష్టి పెట్టి అక్కడే సంపాదించుకుంటున్నారు.