అదేంటి? అనుకుంటున్నారా? ఔను..నిజమేనట. తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలితపై సూపర్ స్టార్ కృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారట. అంతేకాదు.. చిర్రెత్తుకొచ్చి.. నానా మాటలు అనేశారట. పైగా.. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. మరి ఎంతో సౌమ్యంగా ఉండే హీరో కృష్ణకు జయలలితపై కోపం రావడం ఏంటి? ఆమెను ఎందుకు కోప్పడ్డారు? అనేది ఆసక్తికర పరిణామం. హీరో కృష్ణ కుమార్తె పద్మావతికి వివాహం చేయాలని నిర్ణయించారు.
పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణకుమారిల కుమారుడు జయదేవ్‌తో నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇక వివాహం మద్రాస్‌లో చేయాలని నిర్ణయించి.. అందరికీ ఆహ్వానాలు పంపించారు. అది 1991. అప్పట్లో తమిళనాడు సీఎంగా జయలలిత ఉండేవారు. ఇక, ఆమెతో గతంలో అనేక సినిమాల్లో నటించిన కృష్ణ.. అదేఅనుబంధంతో ఆమెను కూడా ఆహ్వానించా రు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కూడా ఆయన పిలిచారు. సీఎంల నుంచి మంత్రుల వరకు అందరికీ ఆయన ఆహ్వానాలు పంపించారు. ఇక, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచారు.
మొత్తానికి మద్రాస్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లుచేశారు. ఆహ్వానితులు అందరూ హీరో కృష్ణ కుమార్తె పెళ్లి జరుగుతోందనే సంబరంతో తరలి వచ్చారు. వీరిలో అన్నగారు ఎన్టీఆర్ నుంచి అక్కినేని, చిరంజీవి, మంత్రులు ఎంతో మంది ఉన్నారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి.. ఇక, విందు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో.. తమిళనాడు సీఎం జయలలిత వస్తున్నారని కృష్ణకు వర్తమానం అందింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ ముందుగా వచ్చారు.
ఇదేసమయంలో ఆయన వెంట జయలలిత భద్రతాధికారి కూడా వచ్చారు. వచ్చీరావడంతోనే వేదిక వద్ద ఇతరులు ఎవరూ ఉండేందుకు వీల్లేదని.. వచ్చిన వారిని వేరే చోటకు పంపించాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలు హీరో కృష్ణకు నచ్చలేదు. నా ఇంట్లో పెళ్లికి.. నేను ఆహ్వానించిన వారు వస్తే.. వారిని లేచిపొమ్మంటారా?
అంటూ.. వారిపైనే విరుచుకుపడ్డారు. అయితే.. సీఎం ప్రొటోకాల్ మేరకు తప్పదని వారు నచ్చజెప్పారట. కానీ, కృష్ణ మాత్రం వినిపించుకోలేదు.
వెంటనే సీఎం జయకు ఫోన్ చేసి.. నువ్వు రావొద్దు.. వాళ్లను పంపించొద్దు.. అని ముక్తసరిగా చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే.. వేదికలో ఉన్న పరిస్తితి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తెలుసుకున్న జయలలిత.. మర్నాడు.. వధూవరులను ఇద్దరినీ తన ఇంటికే పిలిపించుకుని కానుకలు ఇచ్చారట. ఏదేమైనా.. తన ఇంటికి అతిథులు వస్తే.. చూపే మర్యాద విషయంలో కృష్ణకు కృష్ణే సాటి అంటారు.