నిజానికి ఏ సినిమా అయినా.. నటుడికి స్కోప్ ఉండాలి. తనలోని నటనను తెరమీద ఆవిష్కరించేందుకు.. సరైన పాత్ర కూడా లభించాలి. కానీ, ఒక్కొక్కసారి ఇలాంటి అవకాశాలు లభించకుండానే సినిమాలు పూర్తయిపోతుంటాయి. ఇప్పుడే కాదు.. గతంలోనూ.. అనేక మంది హీరో హీరోయిన్లకు.. స్కోప్ లేని అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలను గురించి చెప్పాలంటే.. ఆయనకు మంచి పాత్రలే దక్కినా.. ఒక్కొక్క సినిమాలో ఆయనకు స్కోప్ ఉండేది కాదు.
ముఖ్యంగా పాటల విషయంలో అయితే.. మరింతగా అన్నగారికి స్కోప్ తగ్గిన సినిమాలు కూడా ఉన్నాయి. సడిచేయకే గాలి.. సడిచేయబోకే..
–నీ మది చల్లగా.. స్వామీ నిదుర పో.. దేవుని నీడలో
.. అలిగిన వేళనే చూడాలి.. అల్లరి కృష్ణుని అందాలు
వంటి పాటలు ఎన్ని సార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపించే లా ఉంటాయి. ఈ పాటల్లో అన్నగారు ప్రత్యక్షంగా కనిపిస్తారు. కానీ, నటనంతా కూడా హీరోయిన్లు డామినేట్ చేస్తారు.
అంటే ఒక రకంగా.. అన్నగారి పాత్రకు ఈ పాటల్లో ఎక్కడా స్కోప్ లేదు. అయినా.. కూడా అన్నగారు ప్రేక్ష కులను మైమరపింప జేసిన పాటలు ఇవే కావడం గమనార్హం. తన భావభావాలు.. చిరునవ్వు.. కన్నుల ద్వారా.. ఇలాంటి పాటల్లో ప్రేక్షకులను అన్నగారు మంత్రముగ్ధులను చేస్తారు. నిజానికి ఈ పాటల్లో సావిత్రి, రాజసులోచన, జమునలకు స్కోప్ ఎక్కువ. వారు అలానే నటించారు.
కానీ, వారికన్నా కూడా అసలు ఏమాత్రం స్కోప్ లేకపోయినా.. అన్నగారి నట విన్యాసం.. ఈ పాటల్లో మనల్ని కట్టి పడేస్తుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే.. తెలుగు చలన చిత్ర వినీలాకాశంలో ఎన్టీఆర్ ధ్రువతారగా నిలిచిపోయారు.