తెలుగు చిత్ర సీమకు హీరో అవుదామని వచ్చి.. తన విలక్షణ నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. తెలుగు అన్నా..సంప్రదాయాలన్నా.. ఆయనకు పంచ ప్రాణాలు. తొలినాళ్లలో ఒకటి రెండు సినిమాలకు హీరోగా చేశారు. అయితే.. తర్వాత ఆయనకు అన్నగా అనేక పాత్రలు వచ్చాయి. తర్వాత.. తండ్రిగా, తాతగా అవకాశాలు వచ్చాయి. ఎలాగంటే.. తనకంటే వయసులో పెద్దవారైన అక్కినేని, ఎన్టీఆర్‌లకుకూడా అన్నయ్యగా నటించాల్సి వచ్చింది.
ఇక, అక్కినేనికి తండ్రిగా కూడా నటించారు. అదే సమయంలో విలన్‌గానూ పలు పాత్రలు పోషించారు. పౌరాణికమైనా, సాంఘికమైనా ఆ పాత్రలో ఇమిడిపోయేవారు. తెలుగు ఉచ్ఛారణలో ఎక్కడా రాజీపడేవారు కాదు. అయితే.. రంగారావు, ఎన్టీఆర్‌ల మాదిరిగానే గుమ్మడికి కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఇదే ఆయనకు పెద్ద సమస్య తెచ్చింది. అంతేకాదు.. స్థానిక పత్రికలలోనూ ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చేలా చేసింది.
పరిశ్రమలోకి వచ్చిన తర్వాత.. తొలిసారిగా ఆయన సింగపూర్ వెళ్లారు. అక్కడి క్రమశిక్షణ, పరిశుభ్రత ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. ‘‘సింగపూర్, అక్కడి ప్రదేశాలను చూసి ఆశ్చర్యపోయా. కారులో ఎక్కడికో వెళ్తూ, ఏదో ఆలోచిస్తూ అలవాటుగా చేతిలో ఉన్న సిగరెట్‌ని ఆర్పేసి, కిటికీలోంచి బయటికి విసిరేశాను. కొంత దూరం వెళ్లామో లేదో, పోలీసులు కారు ఆపి, సిగరెట్ రోడ్డుమీద పారేసిందెవరు ? అని కనుక్కుని, నన్ను స్టేషన్‌కి తీసుకువెళ్లారు. రోడ్డుపై సిగరెట్ పారేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.
నేను కొత్తవాడినని తెలిసి శిక్ష వెయ్యలేదు. కానీ, 1000 రూపాయలు జరిమానా కట్టమన్నారు..! కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు, ఈ సిగరెట్ ఉదంతం ఎలా తెలుసుకున్నారో ఆశ్చర్యం“ అని గుమ్మడి వ్యాఖ్యానించారు. అయితే.. గుమ్మడికి సింగపూర్ పోలీసులు రూ.1000 జరిమానా విధించిన విషయాన్ని భారత పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇది అప్పట్లో చర్చనీయాంశం అయింది.