మహానటి సావిత్రి.. సుమారు 250 సినిమాల్లో నటించారు. ఆవిడ నటనకు నిజానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతారని అనుకుంటారు. కానీ, నిజానికి చెప్పాలంటే.. తమిళనాడులో ప్రజలు సావిత్రికి బ్రహ్మ రథం పట్టారు. సావిత్రి అమ్మన్ అంటూ.. ఆమెను ఇంట్లో దేవతగా మార్చేశారు. అప్పట్లో సావిత్రి నటించిన సినిమాల ప్రభావంతో తమ పిల్లలకు సావిత్రి పేరు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు.
సావిత్రి అమ్మన్ పేరు ఇప్పటికీ వినిపిస్తుంది. టీ నగర్ జంక్షన్ దాటి కొంచెం ముందుకు వెళ్తే.. గతంలో సావిత్రి ఉన్న మహిళా హాస్టల్ ఉన్న రోడ్డుకు సావిత్రి అమ్మన్ రోడ్ అని పేరు కనిపిస్తుంది. దీనిని స్థానికు లు పట్టుబట్టి మరీ చెన్నై మునిసిపల్ కార్పరేషన్ అధికారులతో చర్చించి మరీ ఉంచుకున్నారు. తీర ప్రాంత జిల్లా రామేశ్వరరానికి ఒక షూటింగు కోసం వెళ్లినప్పుడు అక్కడి మత్స్యకారులు సావిత్రికి పీతలతో 10 రకాల వంటకాలు చేసి పెట్టారట.
సాధారణంగా పీతలతో కూరలు, పులుసులు, వేపుళ్లు మాత్రమే చేస్తారు. కానీ, ఇక్కడ పీతలతో 10 రకాల వంటకాలు చేసి ఆమెను ఆనందపరిచారు. అంతేకాదు.. ఆమెకు పూలు పరిచి మరీ మత్య్సకారులు స్వాగతం పలికారు. చిత్రం ఏంటంటే.. 1977లో వచ్చిన తుఫాను(ఏపీలో కృష్ణాజిల్లా కొట్టుకుపోయిన తుఫాను) కారణంగా.. ఇక్కడి మత్య్సకారుల ఇళ్లు కూడా సముద్రంలో కలిసిపోయాయి.
అయితే..ఈ విషయం తెలిసిన వెంటనే సావిత్రి.. తన బ్యాంకు ఖాతా నుంచి అప్పట్లోనే 5 లక్షల రూపాయ లు(ఇప్పటి లెక్కల్లో సుమారు 5 కోట్లు ఉండొచ్చు) వారికి పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. అందుకే.. ఇప్పటికీ మత్స్యకార గ్రామాల్లో సావిత్రి అంటే అభిమానిస్తారు. సావిత్రి మరణంతో మత్స్యకార గ్రామాల్లో విషాదం నెలకొని దాదాపు నెల రోజుల పాటు వారు కన్నీరు పెట్టుకున్నారట