సినీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో హీరోయిన్లు జయలలిత-శోభన్‌బాబు. వీరిద్దరూ కలిసినటించిన సినిమాలు తక్కువే అయినా.. తొలిచూపులోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందనేది ఇండస్ట్రీ టాక్. ఇది 1970లలో మాట. అప్పటికి శోభన్‌బాబు మంచి ఫామ్‌లో ఉన్నారు. జయలలిత కూడా ఇటు తమిళ, అటు తెలుగు ఇండస్ట్రీల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇది గాంధర్వ వివాహం వరకు వెళ్లిందనేది అప్పటి ఇండస్ట్రీ పెద్దల మాట.
అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలులేవు. కానీ, వీరి మధ్య ప్రేమ, పెళ్లి వంటివి మాత్రం తరచుగా తెరమీదకు వస్తూనే వున్నాయి. జయలలిత వత్తిడితోనే శోభన్‌బాబు చెన్నై విడిచి హైదరాబాద్‌కు రాలేదని.. అక్కడ స్థిరపడడానికి జయలలితే కారణమనే ప్రచారం కూడా ఉంది. ఇక, జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు శోభన్‌బాబు ఇంట్లో సంబరాలు జరిగాయనేది కూడా వార్తల్లోకి వచ్చింది. కానీ, ఎవరూ ఈ విషయాలను బాహాటంగా ఒప్పుకోరు. ఇటీవల మృతి చెందిన చంద్రమోహన్ గతంలో ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
వారిమధ్య ఏముందనేది నాకు తెలియదు. కానీ, జయలలిత ఫొటో మాత్రం తన దగ్గర ఉండేదని శోభన్‌బాబు చెప్పాడు. ఆయన చాంబర్‌లోనూ జయలలిత ఫొటో ఉండేది. జయ లలిత పాలనపై శోభన్‌బాబుకు మంచి అభిప్రాయం ఉంది. వారి మధ్య ఏముందో నాకు చెప్పలేదు. పోయెస్ గార్డెన్ వెనుకాలే శోభన్‌బాబుకు స్థలం ఉంది. ముందు శోభన్‌బాబే దీనిని కొన్నాడు. తర్వాత.. పోయెస్ గార్డెన్‌ను జయలలిత కొనుగోలు చేసింది. ఎప్పుడు మాట్లాడినా.. కొందరి జీవితాలు ఇంతే! అని మాత్రం అనేవాడు
అని చంద్రమోహన్ చెప్పారు.
సినీ తారల వ్యక్తిగత జీవితాలపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయని.. అయితే.. అవన్నీ నిజమని చెప్పలేమని, అలాగని తప్పని కూడా అనలేమని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. జయలలిత-శోభన్ బాబు విషయంలో మీడియా కొంత దూకుడు ప్రదర్శించిందని.. దీనివల్ల శోభన్‌బాబు మానసికంగా ఇబ్బందులు పడ్డారని ఆయన వెల్లడించారు. అలాగని ఎవరినీ ఆయన నిందించలేదన్నారు. మౌనంగా ఉంటే సమస్యలు అవే పరిష్కారం అవుతాయని నమ్మే వ్యక్తి శోభన్ బాబు అని వెల్లడించారు.