టాలీవుడ్ చరిత్రలో నటనకు డిక్షనరీ ఉన్న కొద్దిమంది నటీనటులలో దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన నటించని పాత్రలో లేవు. జీవించని వేషం లేదు. జానపదాలు, సాంఘికాలు, పౌరాణికాలకు పెట్టింది పేరు ఏఎన్‌ఆర్. ఒకప్పుడు అక్కినేని జానపద, పౌరాణిక సినిమాలు ఎక్కువగా చేసేవారు. అలాంటి టైంలో ఆయన సాంఘికం సినిమాలకు పనికిరాడు అంటూ కొందరు ఎద్దేవా చేసేవారట.
అయితే ఆ వెక్కిరింపుల నుంచి బయట పడాలి.. మంచి సాంఘికం సినిమా తీయాలని అక్కినేని నిర్ణయించుకున్నారు. ఈ టైం లోనే ఎల్వీ ప్రసాద్.. ‘ సంసారం ‘ అని ఒక సాంఘిక కథాంశం ఉన్న సినిమా తీయాలని నిర్ణయించుకుని అందులో అక్కినేని హీరోగా పెట్టుకోవాలనుకున్నారు. అయితే అతడు హీరో ఏంటి ? పైగా సాంఘిక సినిమాలో అక్కినేనిని హీరోగా తీసుకుంటావా ? అంటూ ఎల్వీ ప్రసాద్ కు చాలామంది వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే అందరి మాటలు పట్టించుకోని ఎల్వీ ప్రసాద్.. అక్కినేనిని హీరోగా పెట్టి సోషల్ ఎలిమెంట్ ఉన్న సినిమా సంసారం తెరకెక్కించారు.
మద్రాసులోని మౌంట్ రోడ్‌లో కల నిజమాయేగా అనే పాటలో ఎంతో గ్లామర్‌గా అక్కినేనిని చూపించాలని అనుకున్నారు. అందుకు తనని తాను మేకవర్ చేసుకున్నారు. ఆప్టికల్స్ కంపెనీకి వెళ్లి అప్పటివరకు అందరూ వాడుతోన్న కళ్ళద్దాలు కాకుండా అందుకు భిన్నంగా తన కళ్ళకు సరిపోయేలాగా భిన్నమైన కళ్లద్దాలను సెలెక్ట్ చేసుకున్నారట. అక్కినేని చాలా స్టైల్‌గా కళ్ళద్దాలు పెట్టుకోవడం ఓ ట్రెండ్ అయింది. అక్కినేని స్టైల్ చూసి చాలామంది తెలుగు ప్రజానికం వేల కొద్ది అలాంటి కళ్ళజోళ్ళని కొనుగోలు చేశారు. అప్పట్లో అది తెలుగు నేలపై ఒక సెన్షేషన్ అయ్యింది.
‘ సంసారం ‘ సినిమాలో మయో ఆప్టికల్స్ కళ్ళజోళ్లను అక్కినేని వాడారని.. ఆ సినిమా విడుదలైన వెంటనే పదివేలకు పైగా ఆ కంపెనీ కళ్లద్దాలు అమ్ముడుపోయాయని.. అప్పట్లో ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో అక్కినేనికి సదరు కంపెనీ వారి కృతజ్ఞతలు కూడా తెలిపారట. అయితే ఈ సినిమాతో అక్కినేని సోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చేయలేడని విమర్శించిన వాళ్లే శభాష్ అంటూ మెచ్చుకుని విజిల్స్ వేసేలా చేశాడు.